జిల్లాల వరుస పర్యటనలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ క్యాడర్ కి స్థైర్యం నింపుతున్నారు. అలాగే నియోజకవర్గాలలో పార్టీకి బలమైన నాయకులు ఎవరనేది ఒక అంచనాకి వస్తున్నారు. సీనియర్ నాయకులతో పాటు యువ నాయకుల బలబలాలని పరిశీలిస్తున్నారు. అదే సమయంలో జనంలోకి వెళ్తూ రోడ్ షోల ద్వారా వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతూ తన హయాంలో ప్రజల కోసం ఏం చేసింది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ రోడ్ షోలు జిల్లాల పర్యటనల ద్వారా పార్టీ బలాన్ని మరింత విస్తృతం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు పర్యటించిన అన్ని జిల్లాలలో మరల టీడీపీ క్యాడర్ పునరుత్తేజం అయ్యింది. ఇక ఉత్తరాంద్ర పర్యటనలో కూడా చంద్రబాబు పార్టీ క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు.
ఇదిలా ఉంటే ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఈ రెండు జిల్లాలలో గత ఎన్నికలలో మెజారిటీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీకి బలమైన నాయకులు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్నారు. అయితే టీడీపీకి కూడా అంతే బలమైన నాయకులు ఉన్నారు. కాని సామాజిక సమీకరణాల కారణంగా, అలాగే జనసేన ప్రభావంతో టీడీపీ ఆ రెండు జిల్లాలలో సింగిల్ డిజిట్ కి పరిమితం అయ్యింది. మెజారిటీ స్థానాలు వైసీపీ గెలుచుకుంది. అయితే గత కొన్నేళ్ళ నుంచి వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయి.
ముఖ్యంగా నెల్లూరులో అయితే ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. దీంతో ఎవరికి వారుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే రీసెంట్ గా జగన్ పుట్టినరోజు వేడుకలు కూడా ఎవరికి వారుగా చేసుకున్నారు. అది కూడా పోటాపోటీగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో కూడా చాలా మంది వైసీపీ నాయకులు అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ఆ రెండు జిల్లాలలో పర్యటించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీలో ఉన్న వర్గ విభేదాల్ని చంద్రబాబు తనకి ఏ విధంగా అనుకూలంగా మార్చుకుంటాడు అనేది ఇప్పుడు వేచి చూడాలి.