కుప్పంలో జీవో నెంబర్ 1తో చంద్రబాబు పర్యటనని వైసీపీ ప్రభుత్వం పోలీసులని ఉపయోగించుకొని విజయవంతంగా అడ్డుకుంది. అయితే ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు కూడా పోలీసులపై తిరగబడ్డారు. ఈ ఘటనల నేపధ్యంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. అయితే కుప్పం పర్యటనలో చంద్రబాబు ఉన్నప్పుడు వారిని అరెస్ట్ చేస్తే మరింత గందరగోళంగా పరిస్థితి మారే అవకాశం ఉందని పోలీసులు భావించారు.
ఈ నేపధ్యంలో కుప్పం పర్యటన ముగించుకొని చంద్రబాబు హైదరాబాద్ కి వెళ్ళిన తర్వాత పోలీసులు వేట మొదలుపెట్టి కేసులు నమోదు చేసిన టీడీపీ కార్యకర్తలు, నియోజకవర్గ నేతలని అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఇలా చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ ల పర్వం పై పత్రికలో వచ్చిన కథనాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి తమ పార్టీ కార్యకర్తలని అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు.
దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తప్పుడు కేసులు పెట్టి తమ నాయకులని కార్యకర్తలని వేధిస్తున్న పోలీసులు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఎవరినీ వదిలిపెట్టనని, కచ్చితంగా ప్రతి ఒక్కరికి సమాధానం చెబుతానని అన్నారు. టీడీపీ కార్యకర్తలపై ఫిర్యాదులు చేసిన సీఐలు, ఎస్సైలు, వారి వెనుక ఉండి కథ నడిపిస్తున్న ఎస్పీ, డిఎస్పీలు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి సమాధానం చెబుతామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఇక అరెస్ట్ అయిన టీడీపీ కార్యకర్తలకి పార్టీ అండగా ఉంటుందని, న్యాయపరంగా ఎదుర్కొని వారిని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని బాబు హామీ ఇచ్చారు.