జీవో నెంబర్ 1తో కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటనకి వైసీపీ అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అస్సలు రోడ్డు మీదకి వచ్చి తిరగకుండా భారీగా పోలీసులని మొహరించి అడ్డుకుంటున్నారు. ఒక వేళ నిబంధనలు అతిక్రమించి రోడ్ షో చేయడానికి ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు రెడీగా ఉన్నారు. మరో వైపు వైసీపీ నాయకులు అందరూ మీడియా ముందుకి వచ్చి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అతనిపై మాటలతో దాడి చేస్తున్నారు. కుప్పంలో పార్టీ కార్యాలయం నుంచి ప్రజల మధ్యకి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన చంద్రబాబుని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గంలో తాను తిరగకుండా అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారని పోలీసులని నిలదీశారు. కార్యకర్తలు నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో చంద్రబాబు ద్వజం ఎత్తారు. జగన్ రెడ్డి ఒక సైకో అని విమర్శించారు. సైకో పాలనలో ప్రతిపక్షాలని అణచివేయడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు. పోలీసులు బానిసలుగా పనిచెయకుండా కాస్తా మనస్సాక్షికి లోబడి పని చేయాలని అన్నారు. వైసీపీ నేతలు ప్రతి రోజు ఇంటింటికి అంటూ రోడ్ షోలు నిర్వహిస్తే వారికి లేని అభ్యంతరం మాకు మాత్రమే పెడతారా అని ప్రశ్నించారు.
అసలు జీవో నెంబర్ 1కి చట్టబద్దత లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఆ పార్టీని భూస్థాపితం చేస్తానని అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులకి మరల బాధ్యత గుర్తుచేస్తానని, తనని పంపించాలని చూసిన అందరిని కచ్చితంగా తాను అధికారంలోకి రాగానే ఇంటికి పంపించేస్తా అని అన్నారు. ఇకపై వైసీపీ నాయకులు అందరూ కూడా రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు.