కుప్పం పర్యటనలో చంద్రబాబు రోడ్ షో చేయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అస్సలు ఏ మాత్రం ప్రజలలో తిరిగే అవకాశం పోలీసులు బాబుకి ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు మీరు పోలీసులా, టెర్రరిస్ట్ లా అంటూ ప్రశ్నించారు. మీరు ఎవరూ పోలీసుల మాదిరి ప్రవర్తించడం లేదని విమర్శించారు. వైసీపీ నాయకులు మీ మెడ మీద కత్తి పెట్టి ఇలా చేయిస్తున్నారనే విషయం తనకు తెలుసని అన్నారు. వైసీపీ పోలీసులని బానిసలుగా మార్చుకొని ప్రతిపక్షాల పూర్తిగా అణచివేసే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వాటికి భయపడే పరిస్థితి లేదని అన్నారు.
ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా తాను సిద్ధమని అన్నారు. జగన్ రెడ్డి అరాచకాలు ఎక్కువ కాలం సాగవని అన్నారు. తాను ధర్నా చేస్తే సభకి అనుమతి ఇచ్చారని అన్నారు. ప్రతిపక్షాలకి జగన్ రెడ్డి భయపడి ఇలా పోలీసులని ఉపయోగించుకొని నల్లచట్టాలు ప్రయోగిస్తూ ఉన్నారని అన్నారు. మీకు రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే మిమ్మల్ని నడిరోడ్డు మీద బట్టలు విప్పించి నడిపించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. తనని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని అన్నారు.
వైసీపీ పతనానికి ఇదే ఆరంభం అన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కుప్పంలో చంద్రబాబు పర్యటనని అడ్డుకోవడంపై పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. ధర్నాలు నిర్వహిస్తున్నారు. అలాగే జీవో నెంబర్ 1ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ యాత్రలు అడ్డుకోవడానికి జగన్ రెడ్డి కుట్రపూరితంగా ఈ నల్లచట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో ఉన్న చట్టాలని బూజు దులిపి మరల ప్రతిపక్షాలని అణచివేయడానికి వైసీపీ సర్కార్ ప్రయత్నం చేస్తుందని, దీనిపై ప్రజలు కూడా తిరగబడే రోజులు వస్తుందని అన్నారు.