సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన అధినేత కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొని చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకి లక్షరూపాయిల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ సభలో భాగంగా మంత్రి అంబటి రాంబాబుపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. బాధితులకి ఇచ్చే డబ్బులలో కూడా ఆయన పర్సెంటేజ్ తీసుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. తన దగ్గర ఉన్న సొమ్ము కౌలు రైతుల కుటుంబాల కోసం ఇస్తున్నానని, అయితే అంబటి రాంబాబు లాంటి వైసీపీ నాయకులు మాత్రం బాధితులకి వచ్చే సొమ్ముని కూడా దోచుకుంటున్నారని అన్నారు. ఇక దీనిపై అంబటి రాంబాబు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న
కౌలు రైతుల కుటుంబాలకి ఇచ్చే డబ్బుల్లో తాను పర్సంటేజ్ తీసుకున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చాలెంజ్ విసిరారు. లేదంటే నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అంబటి చాలెంజ్ చేసిన రెండో రోజే సత్తెనపల్లిలో డ్రైనేజ్ కాలువలో పడి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన ఐదు లక్షలలో సగం ఇవ్వాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేసారని మంగమ్మ అనే మహిళ మీడియా ముందుకి వచ్చి చెప్పారు. మంత్రి అంబటి దగ్గరకి న్యాయం చేయాలని వెళ్తే ఆయన కూడా అలాగే డిమాండ్ చేసారని పేర్కొన్నారు.
ఈ వీడియోని జనసేన సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేసింది. ఇప్పుడు అంబటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ న్యూస్ పత్రికలలో కూడా ప్రముఖంగా కవర్ అయ్యింది. దీనిపై టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పేపర్ క్లిప్ ని ట్యాగ్ చేసి ఛీ… మీరు పాలకులా అంటూ విమర్శించారు. ఇక మగమ్మ వీడియోని జనసేన వారు ట్రోల్ చేయడంపై అంబటి రాంబాబు స్పందించారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తుందని, తన చేతుల మీదుగా ఆమెకు చెక్కు పంపిణీ చేసానని పేర్కొన్నారు.