ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలన మొదలెట్టినప్పటి నుంచి అరాచకాలు, విద్వంసాలని నమ్ముకొని పాలన సాగిస్తుందని చంద్రబాబు మరోసారి జగన్ పాలనపై విమర్శలు చేశారు. గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ పాలనలో ప్రజలకి ప్రతి పండగకి కానుకలు ఇచ్చేవాళ్ళ అని, అయితే ఇప్పుడు జగన్ అవన్నీ తొలగించారని అన్నారు. అలాగే పెన్షన్ లపై కూడా మాట తప్పారని విమర్శించారు. మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి, ఇప్పటి వరకు ఇవ్వకపోగా ఉన్న పెన్షన్ లని కూడా ఏవో కారణాలు చూపిస్తూ తొలగించడం దారుణమని అన్నారు. పెన్షన్ డబ్బులు పెంచిన ప్రతిసారి పెన్షన్ లబ్దిదారులని తగ్గించుకుంటూ వెళ్తున్నారని అన్నారు.
తాము అధికారంలోకి వచ్చి ఉంటే వెంటనే మూడు వేలు పెన్షన్ ఇచ్చేవాడిని అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వైఎస్ హయాంలో 200 ఉన్న పెన్షన్ ని తాము రెండు వేలకి పెంచామని, అలాగే ఎన్టీఆర్ నుంచి నా వరకు అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబు చెప్పారు. పేదల సంక్షేమానికి టీడీపీ ఇచ్చిన ప్రాధాన్యత ఎవ్వరు ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు జగన్ రెడ్డి ఇంట్లో ఎంత మంది అర్హులు ఉన్న ఒక్కరికే పెన్షన్ అనే పద్ధతి తీసుకొచ్చారని అన్నారు.
తాము మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్థామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో ప్రజలు ఎవరూ కూడా ప్రశాంతంగా లేరని అన్నారు. టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావడం పక్కా అని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. అలాగే విదేశాలలో ఉన్న ఆంధ్రులు అందరూ జన్మభూమి ఋణం తీర్చుకోవడానికి రావాలని, జగన్ ని గద్దె దించడంతోనే మళ్ళీ ఏపీ భవిష్యత్తుని అద్బుతంగా నిర్మించుకోగలం అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రన్న కానుకలని కొంత మందికి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు.