ప్రతిపక్షాలని అణచివేసే కుట్రలో భాగంగా వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 ని తీసుకొచ్చింది. అయితే దీనిని హైకోర్టు తాజాగా సస్పెండ్ చేసింది. బ్రిటిష్ కాలం నాటి జీవోని, ఎలాంటి ప్రామాణికం లేకుండా ఎలా తీసుకొస్తారు అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఇదిలా ఉంటే ఈ జీవోకి వ్యతిరేకంగా విపక్షాలు ఇప్పటికి ఆందోళనని కొనసాగిస్తున్నాయి. అన్ని పార్టీలు మూకుమ్మడిగా ఈ జీవోని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే భోగి రోజున వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచాట్టం పూర్తిగా ద్వంసం అయిపోవాలని కోరుతూ చంద్రబాబు నాయుడు ఈ జీవో నెంబర్ 1 ప్రతులని భోగి మంటల్లో తగలబెట్టారు. ప్రతిపక్షాలని అణచివేసే కుట్రలో భాగంగానే జగన్ రెడ్డి ఇలాంటి నల్లచాట్టాలని వెలికి తీసి ఆయుధాల మాదిరి ప్రయోగిస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు.
పార్టీ నాయకులతో కలిసి ఆయన జీవో ప్రతులని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, ఎక్కడా కూడా అభివృద్ధి అన్నదే కనిపించడం లేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అలాగే రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. తనకి ఈ రోడ్లపై తిరిగి నడుము నొప్పి వచ్చిందని అన్నారు. సైకో పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే పన్నుల రూపంలో, పెట్రోల్ ధరలతో ఇష్టారీతిలో దోపిడీ చేస్తున్నారని దయ్యబట్టారు.
అసలు జగన్ రెడ్డి అంటే తనకి ఎలాంటి ద్వేషం లేదని చెప్పిన చంద్రబాబు, వారి పరిపాలన మీద మాత్రమే తాను పోరాటం చేస్తున్నానని అన్నారు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని, ప్రజా శ్రేయస్సు, పిల్లల జీవితాలని ఆలోచిస్తూ వారికి మంచి భవిష్యత్తు అందించే దిశగా పాలన చేయాలని, అలా కాకుండా ఓ వైపు సంక్షేమం అంటూ డబ్బులు పంచుతూ మరో వైపు నుంచి వాటిని దోచుకోవడం పనిగా వైసీపీ ప్రభుత్వం పెట్టుకుందని అన్నారు. ఇక ప్రతి అంశంపై ప్రశ్నిస్తూ ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్తున్నామని తమని అడ్డుకోవడానికి అడ్డమైన ఆంక్షలు విధిస్తున్నారని చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.