ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు పర్యటించారు. శ్రీకాకుళం గత ఎన్నికలలో టీడీపీ కేవలం రెండు స్థానాలకి మాత్రమే పరిమితం అయ్యింది. ఇక విజయనగరం అయితే తొమ్మిది స్థానాలకి తొమ్మిదింటిని కోల్పోయింది. ఆ రెండు జిల్లాలు ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేవి. అక్కడి నుంచి చాలా బలమైన నాయకులు టీడీపీ పార్టీ ద్వారా చట్టసభలకి ప్రాతినిధ్యం వహించారు. అయితే అలాంటి మహామహులు ఉన్న జిల్లాలలో టీడీపీ పార్టీ గత ఎన్నికలలో ఓడిపోవడం ఒకింత నిరాశ పరిచే విషయం అని చెప్పాలి. అయితే ఈ మూడేళ్ళ కాలంలో ఉత్తరాంద్ర జిల్లాలో టీడీపీ పార్టీ తన స్తామినా పెంచుకుంది. ముఖ్యంగా కింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలో అన్ని నియోజకవర్గాలలో బలమైన నాయకులని సిద్ధం చేశారు.
ముఖ్యంగా యువ నాయకత్వాన్ని బలంగా తయారు చేస్తున్నారు. అలాగే విజయనగరంలో కూడా యువ నాయకులతో పాటు అశోక గజపతి రాజు గతంలో కంటే ఇప్పుడు చాలా చురుకుగా రాజకీయ క్షేత్రంలో తిరుగుతున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా చంద్రబాబు పర్యటనలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో నిర్వహించిన రోడ్ షోలలో భారీగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎన్నడూ లేని విధంగా రోడ్ షోలతో పాటు చంద్రబాబు నిర్వహించిన ఇదేం కర్మం రా రైతులకి అనే సభకి కూడా భారీగా రైతులు, ప్రజలు హాజరయ్యారు. ఈ జనసమీకరణ బట్టి రానున్న ఎన్నికలలో టీడీపీకి ఉత్తరాంద్ర నుంచి కచ్చితంగా బలమైన సీట్లు వస్తాయనే సంకేతాలు ఇస్తుంది.
చంద్రబాబు పర్యటన క్యాడర్ లో జోష్ నింపడానికి కూడా బాగా పని చేసింది. స్తబ్దుగా ఉన్న నాయకులు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అలాగే యువ నాయకులు అందరూ చంద్రబాబు ఇచ్చిన హామీతో చురుకుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. జనసేన పార్టీ పొత్తు ఉంటే కచ్చితంగా ఉత్తరాంద్రలో బలమైన సీట్లని టీడీపీ కైవసం చేసుకోవడానికి చంద్రబాబు పర్యటన ఒక వేదికగా మారే అవకాశం ఉంటుందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.