Bura Narasaiah goud: బూర నర్సయ్య గౌడ్ ఆసక్తికరంగా పార్టీ మారారు. పార్టీ మారడంలో ఆసక్తి ఏం లేదు కానీ ఆయన మారిన విధానమే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు సందర్భంగా అభ్యర్థి వెంటే ఉండి.. దగ్గరుండి నామినేషన్ వేయించి నెక్ట్స్ డేనే తాను పార్టీ మారుతున్నట్టు బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించి షాకిచ్చారు.చెప్పినట్టుగానే నేడు ఆయన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.బూర నర్సయ్య గౌడ్ వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో ఆ ప్రాంతంలో ఆయనకు మంచి పట్టే ఉంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో బూర చురుకైన పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే 2013లో టీఆర్ఎస్‌లో చేరారు. రాష్ట్ర సాధన అనంతరం భువనగిరి పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తనకు టీఆర్ఎస్‌లో ప్రాధాన్యత తగ్గిందనే యోచనలో ఉన్నారు. జగదీష్ రెడ్డి మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఇద్దరికీ పడటం లేదని టాక్. పార్టీ అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానించడమే మానేశారని బూర నర్సయ్య గౌడ్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.
నర్సయ్య గౌడ్.. బీజేపీలోకి చేరిన వెంటనే టీఆర్‌ఎస్ నేతలను టార్గెట్ చేశారు. పలువురు కీలక నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ఏదో ఒక పదవిలో ఉంటే మాత్రమే సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు అవకాశం లభిస్తుందని ఆరోపించారు.మంత్రి మల్లారెడ్డికి వేల కోట్లు ఉన్నా కూడా చిల్లర పనులు చేస్తున్నారని ఆరోపించారు.నటి సిల్క్ స్మిత లాగా రోడ్లపై ఆ చిందులేంటని బూర మండిపడ్డారు. వాస్తవానికి తాను చాలా సౌమ్యుడినని, అలాంటి తనను గెలకొద్దన్నారు. మంత్రులంతా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.బీజేపీ తరుఫున రేపటి నుంచి మునుగోడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు.