తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా మార్చి బీఆర్ఎస్ పేరు పెట్టారు. ఇక భారతీయ రాష్ట్ర సమితి పేరుతో ఇప్పుడు తన ప్రస్థానం విస్తరించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ మాత్రమే కాకుండా ఏపీలో కూడా అడుగుపెట్టడానికి సిద్ధం అవుతున్నారు. మరో వైపు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబందించిన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడానికి ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇక త్వరలో ఉత్తరాది రాష్ట్రాలలో పర్యటించి బీఆర్ఎస్ పార్టీ పటిష్టతపై కేసీఆర్ దృష్టి పెట్టబోతున్నారు. ఇక ఏపీలో కూడా ఎంతో కొంత తన ప్రభావం ఉంటుందని భావించి పార్టీ విస్తరణలో భాగంగా వైసీపీతో కలిసి పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ముఖ్యంగా ఖమ్మం సరిహద్దులో ఉన్న తూర్పు గోదావరి, అలాగే మరికొన్ని జిల్లాలలో పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఇక వైసీపీ కూడా కేసీఆర్ ఏపీలో పోటీ చేసి తమతో కలిసేందుకు ముందుకొస్తే స్వాగతిస్తామని వైసీపీ అధిష్టానం నుంచి సజ్జల ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక కేసీఆర్ కూడా చంద్రబాబుని దెబ్బ కొట్టడానికి జగన్ తోనే దోస్తీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. జగన్ ఉంటే తెలంగాణకి కూడా కొంత అనుకూలంగా ఉండి తాము చెప్పిన మాట వింటారని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే కేసీఆర్ ఏపీలో దృష్టి పెట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై మళ్ళీ దృష్టిపెట్టారు.
తెలంగాణలో తన పార్టీ క్యాడర్ బలంగా ఉండటంతో నాయకత్వాన్ని పటిష్టం చేసుకొని వచ్చే ఎన్నికలకి సిద్ధం అవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. కేసీఆర్ ని నిలువరించడానికి బీజేపీకి దగ్గరయ్యేందుకు సిద్ధం అవుతున్నట్లు బోగట్టా. అయితే బీజేపీ పార్టీ చంద్రబాబుతో కయ్యం పెట్టుకుంది. అయితే గత ఎన్నికల మాదిరి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని అయిన తనకి బలం ఉన్న నియోజకవర్గాలలో పోటీ చేయాలని చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఏపీలో తనని కేసీఆర్ దెబ్బతీస్తే తెలంగాణలో కేసీఆర్ ని చంద్రబాబు దెబ్బతీయడానికి వ్యూహాలు సిద్ధం చేస్తూ అందులో భాగంగా ఖమ్మంలో టీడీపీ శాఖారావం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.