ఆదిపురుష్ సినిమా టీజర్ పై హిందుత్వ సంస్థల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాత్రల చిత్రణ అంతా దర్శకుడు తన దృక్కోణం నుంచి ఈ జెనరేషన్ వారికి రామాయణం చేరువ చేయాలని హాలీవుడ్ అవెంజర్స్ తరహాలో ఆవిష్కరించారు. అయితే ఇదే ఇప్పుడు హిందుత్వ సంస్థలు, హిందుత్వ వాదులకి ఇబ్బందిగా మారింది. తరతరాలుగా ఒకే రకమైన భావజాలంలో మునిపోయి ఉన్న అందరూ కూడా రామాయణం అంటే కాషాయం, అలాగే రాజులు, కిరీటాలు, రాచరిక ఆనవాళ్ళు కనిపించాలనే భ్రమలోనే ఉన్నారు. రావణుడు పుష్పక విమానం వాడాడు కాబట్టి ఈ సినిమాలో కూడా దానినే చూపించాలనే విధంగా విమర్శలు చేస్తున్నారు. ఇక కొంత మంది సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు కూడా ఆదిపురుష్ సినిమాలో పాత్రల చిత్రణపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అయితే వీటన్నింటికి దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ క్లారిటీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అసలు తమ ఇంటెన్సన్ ఏంటి? ఎందుకు సినిమాలోని పాత్రలని ఇప్పటి వరకు చూసిన తరహాలో కాకుండా కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాము అనే విషయాలకి చానల్స్ ద్వారా స్పష్టత ఇవ్వబోతున్నారు. ఇప్పటికే పలు హిందీ చానల్స్ కి వారు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ రోజు బీజేపీ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యుడు సాక్షి మహారాజ్ ఆదిపురుష్ పై అభ్యంతరం వ్యక్తం చేసారు. రామాయణం వక్రీకరించి ఆదిపురుష్ తెరకెక్కించారని ఆరోపణలు చేశారు. సినిమాని రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అవసరం అయితే కోర్టుకి వెళ్తామని చెప్పారు.
ఇక తాజాగా బ్రాహ్మణ మహాసభ ఆదిపురుష్ టీంకి నోటీసులు జారీ చేసింది. ఆదిపురుష్ సినిమాలోని అభ్యంతర కర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేసింది. సినిమాలో ప్రధాన పాత్రల చిత్రణ అంతా కూడా ఇస్లామిక్ వాదాన్ని ప్రమోట్ చేసే విధంగా ఉందని ఆరోపణలు చేశారు. పూర్తిగా రామాయణాన్ని ఇస్లామికరించడానికి దర్శక, నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే సీత పాత్ర కూడా ఒక మామూలు హీరోయిన్ ని చూపించినట్లు చిత్రీకరించారని అన్నారు. రాముడ్ని, సీతను, హనుమంతుడ్ని ఇస్లామీకరించడమే ఈ సినిమా ఉద్దేశంలా ఉంది అని నోటీసుల్లో పేర్కొన్నారు.