Brahmaji : సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో అయినా, బయట ఏదైనా షోలో అయినా ఆయన ఉంటే అక్కడ కామెడీకి కొదువ ఉండదు. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు. టీనేజర్ అయిపోయి మరీ సందడి చేస్తుంటాడు. అటు అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటూ.. ఇటు సెలబ్రెటీల పోస్టులకు తనదైన స్టైల్లో కౌంటర్‌లు ఇస్తూ నవ్వుల పువ్వులు పూయిస్తుంటారు. బ్రహ్మాజీ సహాయ నటుడుగానూ.. కామెడీ పరంగానూ.. నెగెటివ్ రోల్స్ ఏదైనా సరే ఇరగదీస్తాడు. అందుకేనేమో.. ఆయనకు డే 1 నుంచి కూడా ఆఫర్లు వచ్చి పడుతూనే ఉన్నాయి. తాజాగా బ్రహ్మాజీ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిగత జీవితం గురించి చాలా ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
తాను తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పెరిగానని.. మా తండ్రి తహసీల్దార్ అని తెలిపాడు. అప్పట్లో సీనియర్ నటుడు సోమయాజులు నటించిన ‘శంకరాభరణం’ రిలీజై మంచి విజయం సాధించిందని.. ఈ సక్సెస్‌తో సోమయాజులుకు విపరీతమైన క్రేజ్ పెరిగిందన్నారు. దీంతో ఆయనకు భారీగా సన్మాన కార్యక్రమం నిర్వహించారని.. అది చూసిన తనకు.. సినిమాల్లోకి వెళ్తే ఇంత ఆదరణ ఉంటుందా? అని అనిపించిందన్నారు. ఎలాగైన పరిశ్రమలోకి వెళ్లాలని అనుకుని, చదువు పూర్తయిన వెంటనే చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరానని బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు. అక్కడే కృష్ణవంశీ, రవితేజ, రాజా రవీంద్ర తదితరులతో పరిచయం ఏర్పడిందని తెలిపాడు.
Brahmaji : మళ్లీ పిల్లలు ఎందుకని వద్దనుకున్నాం..
తాను అందరిలా సినిమా కష్టాలు వంటివేం పడలేదని బ్రహ్మాజీ నిజాయితీగా చెప్పుకొచ్చాడు. గులాబి, నిన్నే పెళ్లాడతా, సింధూరం వంటి సినిమాలతో కెరీర్ ప్రారంభంలో మంచి పాపులారిటీ వచ్చిందన్నాడు. తర్వాత పదేళ్లపాటు మాత్రం తాను సంతృప్తి చెందే పాత్రలు లభించలేదు. ఇక తన పర్సనల్ లైఫ్ గురించి బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ‘‘నేను ఒక బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. చెన్నైలో ఉన్నప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడింది. అయితే నేను మ్యారేజ్ చేసుకునే సమయానికే ఆమెకు విడాకులు అయిపోయి, ఒక బాబు కూడా ఉన్నాడు. ఆమెను ఇష్టపడి పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నా. ఇది వరకే బాబు ఉండగా మాకు మళ్లీ పిల్లలు ఎందుకని వద్దనుకున్నాం. ఆ అబ్బాయే ఇప్పడు ‘పిట్టకథ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్డాడు” అని తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు బ్రహ్మాజీ. ఎవరైనా తనకు ఒక బాబు కావాలనుకుంటారు కానీ ఇలా ఒక బాబు ఉన్న మహిళను పెళ్లి చేసుకుని ఆమె బాబునే తన కుమారుడిగా స్వీకరించి పిల్లలు వద్దనుకోవడం బ్రహ్మాజీ మంచితనానికి నిదర్శనమని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.