ఏపీలో రాబోయే ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని టీడీపీ వ్యూహాత్మకంగా రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు జనసేన పార్టీని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తూనే మరో వైపు సొంతగా వెళ్ళినా కూడా మెజారిటీ స్థానాలలో విజయం సాధించే దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. అందులో భాగంగానే ఓ వైపు చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. మరో వైపు లోకేష్ పాదయాత్రకి సిద్ధం అవుతున్నారు. అయితే ఈ పాదయాత్రని వైసీపీ శ్రేణులు అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. వీలైనంత వరకు ప్రతిపక్షాల గొంతు ప్రజలకి చేరకుండా చేయడానికి అధికార పార్టీ అన్ని రకాల బాణాలు సందించే పనిలో ఉంది.
ఇదిలా ఉంటే మరో వైపు ఎన్నికలని లక్ష్యంగా చేసుకొని వైసీపీ వెనకుండి రామ్ గోపాల్ వర్మతో ఏపీ రాజకీయాల నేపధ్యంలో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఇందులో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ని ప్రతినాయక ఛాయలలో చూపించడానికి సిద్ధం అవుతున్నారు. ఇక ఆర్జీవీతో సినిమా చేస్తున్నందుకు గాను నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కి వైఎస్ జగన్ టీటీడీ బోర్డు మెంబర్ గా పదవి కట్టబెట్టారు. దీనిని బట్టి ఆర్జీవీ సినిమా వెనుక వైసీపీ ఉందని అర్ధం అవుతుంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు ఎన్నికలే లక్ష్యంగా బోయపాటిని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తుంది.
బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో ఏపీ రాజకీయాల నేపధ్యంలో ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో సినిమా చేసే ప్రయత్నం మొదలవుతుందని టాక్. ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న అనిల్ రావిపూడి సినిమా పూర్తయిన వెంటనే బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ ఈ సినిమా స్టార్ట్ చేస్తాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా ద్వారా అధికార పార్టీ అరాచాకాలని, వైసీపీ పరిపాలన కాలంలో సృష్టించిన విద్వంసం అంతా తెరపై చూపించే విధంగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు బోగట్టా. ఇక ఎన్నికలకి ముందు ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే దిశగా టీడీపీ అడుగులు వేస్తుందని తెలుస్తుంది.