జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తులపై తన స్పష్టమైన వైఖరి చెప్పేశారు. తన డిమాండ్ ఏంటి అనేది చెప్పేసి బాల్ ని టీడీపీ కోర్టులో వదిలాడు. వైసీపీని గద్దె దించాలంటే తాను అడిగిన సీట్లు ఇవ్వాలనే విధంగా పవన్ కళ్యాణ్ డిమాండ్ ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అయితే టీడీపీతో ఇప్పటికే సీట్ల పంపిణీపై ఒప్పందం జరిగిపోయింది అని మరో వర్గం మీడియాలో వినిపిస్తుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయిన పవన్ కళ్యాణ్ యువశక్తి మీటింగ్ లో చెప్పిన మాటల బట్టి స్పష్టం అయిపోయిందని వైసీపీ కూడా విమర్శలు చేస్తుంది. అయితే ఇంతకాలం బీజేపీ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ తమతో కలిసి ఉంటాడని బలంగా నమ్ముతుంది.
టీడీపీతో తాము ఎట్టి పరిస్థితిలో కలవమని కూడా క్లారిటీ ఇచ్చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తమ పొత్తు బీజేపీతోనే అని పలు సందర్భాలలో చెబుతూ వచ్చారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 50 సీట్ల డిమాండ్ కూడా బీజేపీతో కలుపుకొనే అనే మాట కూడా కొంత మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పొత్తులపై ఇచ్చిన క్లారిటీపై ఇప్పటి వరకు బీజేపీ శ్రేణులు స్పందించలేదు. జనసేన, బీజేపీ కలిసి ఎన్నికలలో పోటీ చేస్తుందనే చెబుతున్నారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు కూడా మరో మార్గంలో బీజేపీని పొత్తుకి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారనే మాట వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తో బీజేపీ కలిసి వస్తే కొన్ని సీట్లు అయిన వచ్చి అధికారంలో భాగస్వామ్యం అవుతుంది. ఒక వేళ వద్దు అనుకుంటే మాత్రం గత ఎన్నికల తరహాలోనే కనీసం డిపాజిట్లు కూడా రావనే రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం బీజేపీలో ఉన్న కొంత మంది నాయకులు మాత్రం జనసేన, టీడీపీతో కలిసి వెళ్లాలనే డిమాండ్ అధిష్టానం వద్ద వినిపిస్తూ ఉంటే మరికొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. మరి అంతిమంగా బీజేపీ మార్గం ఎటువైపు ఉంటుంది అనేది వేచి చూడాలి.