Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 కెప్టెన్సీ టాస్క్. పోటా పోటీగా ఉంటుంది.. దుమ్ము దులిపేస్తారు మన కంటెస్టెంట్స్ అంటే దుమ్ము దులుపుడు లేదు.. ఏమీ లేదు. ఎవరికి వారు సోది కబుర్లు.. సొల్లు ముచ్చట్లు.. ఏదో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలి వారెవరూ టాస్క్‌ను పెద్దగా పట్టించుకునేదే లేదు. అసలు టాస్క్‌ల్లో సీరియస్‌నెస్ లేదు. ఇప్పటికే అన్ని సీజన్లలోకి ఈ సీజన్ చెత్త అన్న టాక్ వచ్చేసింది. రేటింగ్ చూస్తే రోజురోజుకూ దిగజారి పోతోంది. దీన్ని లేపడానికి నిర్వాహకులు ఎంత ప్రయత్నిస్తున్నా కంటెస్టెంట్స్ మాత్రం సహకరించడం లేదు.
7వ వారానికి వచ్చింది. ఎంత సీరియస్‌నెస్ ఉండాలి? అదేమీ లేదు. బిగ్‌బాస్ ఇవాళ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చారు. బిగ్‌బాస్ చెప్పింది చెప్పినట్టు చేయాలి కదా. టాస్క్ అనౌన్స్ చేశారో లేదో.. లూప్ హోల్స్ వెతుక్కోవడం ప్రారంభిస్తున్నారు. ఇక ఆ తరువాత ఎవరి గోల వారిది.గ్రూప్ టాస్క్ అయినా కూడా ఎవరికి వారు విడిపోయి మరీ ఆడటం. ఇక ఇలాగైతే షోని నడిపించడం కష్టమని భావించారో ఏమో కానీ బిగ్‌బాస్ ఇవాళ ఎన్నడూ అంటే ఏ సీజన్‌లోనూ లేనంతగా మండిపడ్డారు. అందరినీ బయటకు వచ్చి లైన్‌లో నిలబడమని రఫ్ఫాడించేశారు.
‘‘ఇప్పటి వరకూ ఏ సీజన్‌లోనూ ఈ టాస్క్ ఇంత నిరాశాజనకంగా జరగలేదు. దీనికి కారణం ఇంటి సభ్యుల నిర్లక్ష్యం.. టాస్క్‌ల పట్ల నిర్లక్ష్యం.. బిగ్‌బాస్ ఆదేశాల పట్ల నిర్లక్ష్యం. మీ నిర్లక్ష్యం బిగ్‌బాస్‌నే కాకుండా ప్రేక్షకులను సైతం నిరాశ పరిచింది. బిగ్‌బాస్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిరాశపరుస్తున్న కారణంగా ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ రద్దు చేయడం జరిగింది. ప్రేక్షకుల పట్ల.. ఈ షో పట్ల గౌరవం లేదని మీరు నమ్మనట్లైతే తక్షణమే ఈ హౌస్‌ను వదిలి వెళ్లిపోవచ్చు. తక్షణమే మీ కాస్ట్యూమ్స్ తీసి స్టోర్ రూంలో పెట్టండి’’ అని బిగ్‌బాస్ చెప్పారు.