AAP : ప్రధాని నరేంద్ర మోదీ ఇలాఖాపైనే అన్ని పార్టీలు దృష్టి సారించాయి. కొడితే ఏనుగు కుంభస్థలంపైనే కొట్టాలని పార్టీలు భావిస్తున్నాయి. ఇక్కడ దెబ్బ పడిందంటే ముఖ్యంగా అటు మోదీ.. ఇటు అమిత్‌షాకు చాలా వరకూ చెక్ పెట్టొచ్చనే యోచనలో పార్టీలున్నాయి. గుజరాత్ అనేది మోదీ, అమిత్ షాలకే కాకుండా పలువురు కీలక నేతలకు సొంత రాష్ట్రం. ఈ క్రమంలోనే గుజరాత్‌పై ఫోకస్ పెట్టాయి. ఇలా ఫోకస్ పెట్టిన వాటిలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ఒకటి. ఇప్పటికే ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లో పర్యటించారు. అక్కడే ఒక ఆటో వాలా ఇంటికి వెళ్లి భోజనం కూడా చేశారు.
ఆ తరువాత ఆ ఆటోవాలాను బీజేపీ తమ వైపు తిప్పుకుంది. అది వేరే విషయం అనుకోండి. అయితే కేజ్రీవాల్ పంజాబ్‌లోనూ ఇలాగే చేశారు. అక్కడ ఘన విజయం సాధించారు. ఆ సెంటిమెంటే తిరిగి గుజరాత్‌లోనూ వర్కవుట్ అవుతుందనే భావనలో ఆప్ ఉంది. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్ ఎన్నికలు జరిగే అకాశముంది. దీంతో పార్టీలన్నీ గుజరాత్‌పై మరింత దృష్టి సారించాయి. సమయం కూడా పెద్దగా లేకపోవడంతో ఎవరు గెలుస్తారనే దానిపై చర్చ ఒకవైపు.. సర్వేలు మరోవైపు ఊపందుకున్నాయి. ఈ సర్వేలు బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చాయి. బీజేపీ ఓటమి పాలవుతుందని చెప్పలేదు కానీ కొంచెం షాకింగ్ న్యూసే చెప్పాయి.
తాజగా ఏబీపీ న్యూస్-సీఓటర్ సంస్థలు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై ఓపీనియన్ పోల్ సర్వే నిర్వహించాయి. ఈ రెండు చోట్ల బీజేపీదే విజయమని సర్వే సంస్థలు తేల్చాయి. అయితే గుజరాత్‌లో ఈసారి బీజేపీకి సీట్లు పెరుగతాయి కానీ ఓటింగ్ శాతం మాత్రం తగ్గుతుందని దీనికి కారణం ఆప్‌యేనని సర్వే సంస్థ తేల్చింది. గుజరాత్‌లో గత ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు రాగా.. ఈ సారి 135 నుంచి 143 వరకు వచ్చే అవకాశముందని స్పష్టం చేసింది. తొలిసారిగా ఇక్కడ ఆప్ ఖాతాను తెరవనుంది. 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని.. 17.4 శాతం ఓటింగ్ వస్తుందని సీ ఓటర్ అంచనా వేసింది. ఈ ఆప్ కారణంగా గతంలో బీజేపీకి 49.1 శాతం ఓట్లు పడగా.. ఈ సారి 46.4 శాతం మాత్రమే పడుతుందని సర్వే సంస్థ అంచనా వేసింది.