Hyderabad : 64 కళల్లో చోర కళ కూడా ఒకటి. దీనిని కొందరు అలవోకగా చేస్తే మరికొందరు ఊరికే పట్టుబడి పోతారు. కొందరు ఫన్నీ దొంగలు కూడా ఉంటారు. గతంలో చూశాం.. దొంగతానికి వెళ్లి బిర్యానీ చూసి టెమ్ట్ అయిపోయి సుష్టుగా భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని అనంతరం దొంగతనం చేద్దామని పడుకుని ఇంటి వాళ్లకు అడ్డంగా దొరికిపోయాడో దొంగ. మరొకరు ఉంటారు. ఎదురుగా కూర్చొన్నా కూడా దొంగతనం విషయాన్ని గుర్తించలేం. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగ.. దొంగతనంలో ఆరిపోయాడు. గుడికే తెలియకుండా గుడిలో లింగాన్ని కొట్టేసే టైప్. సదరు దొంగ గారి వృత్తి సెలూన్‌లో జుట్టు కట్ చేయడం. ప్రవృత్తి జుట్టు కట్ చేస్తూ మెడలో ఏమైనా ఉంటే నైస్‌గా కొట్టేయడం.
సెలూన్‌కి వెళ్తున్నారా..? అయితే, కాస్తంత ఈ వార్త చదివి వెళ్లండి. ఓ పెద్దాయన, రిటైర్డ్ ఎంప్లాయీ.. కాస్తంత జుట్టు పెరగడంతో క్రాప్ చేయించుకుందామని సెలూన్‌కు వెళ్లాడు. నీట్‌గా ఎక్కువ తక్కువలు లేకుండా బార్బర్ చక్కగా కటింగ్ చేశాడు. కానీ, బయటకు వచ్చాక చూసుకుంటే.. ఏదో తక్కువైంది.. ఏదో తక్కువైందని.. చూసుకుంటే అప్పుడు తెలిసింది మెడలో ఉండాల్సిన చైన్ మాయమైందని.. ఇది జరిగింది ఎక్కడో కాదు.. హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటేశ్వర్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ రైల్వే ఎంప్లాయి ఆరవెల్లి సిద్ధయ్యగౌడ్ (87) ఈ నెల 14వ తేదీన కటింగ్ చేయించుకోవడానికి.. పటేల్‌నగర్‌ని సెలూన్‌కి వెళ్లాడు. అక్కడ తుమ్మనూరి నర్సింగ్‌రావు అనే బార్బర్ సిద్ధయ్యకి కటింగ్ చేశాడు.
Hyderabad : పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా..
పెద్దాయన కాబట్టి కాస్తంత మాటల్లో పెట్టి కటింగ్ చేస్తున్నట్టు మభ్యపెట్టి ఆయన మెడలోని మూడు తులాల గోల్డ్ చైన్‌ను కొట్టేశాడు. కటింగ్ పూర్తయిన తర్వాత సిద్ధయ్య బయటకు వచ్చాక మెడలో ఓసారి చూసుకుంటే చేతికి చైన్ తగల్లేదు. దాంతో వెంటనే సెలూన్‌కి వెళ్లి అడగ్గా.. తాను అలాంటిదేమీ చూడలేదని నర్సింగ్ సమాధానం చెప్పాడు. అయితే, నర్సింగ్‌పై అనుమానం ఉన్న సిద్ధయ్య నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో బార్బర్‌ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా.. తానే చోరీ చేసినట్లు అంగీకరించి, మూడు తులాల బంగారు చైన్‌ను తిరిగిచ్చేశాడు.