Bandi Sanjay : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమున్నా ఇప్పటి నుంచే పార్టలీ మధ్య రాజకీయ వేడి మొదలయ్యింది. ఎమ్మెల్యేలంతా ప్రజల్లోనే ఉండాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పార్టీ నేతలకు హుకుం జారీ చేశారు. బీజేపీతో తాడోపేడో తేల్చుకునే సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌తో పాటు క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిసారించింది. అంతేకాకుండా వచ్చే ఎన్నికలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ బీజేపీకి పొత్తు ఉండదని.. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టంచేశారు. బుధవారం బీజేపీ ఆఫీసులో మీడియాతో ముఖాముఖీలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై కీలక వాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ తీరును బట్టి ఆయన ముందుస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని సంజయ్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా… ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం లక్ష ఓట్లు సాధించేలా ప్లాన్ రూపొందించామని తెలిపారు. ఈ సందర్భంగా పొత్తులపై కూడా కొన్ని కీలక వాఖ్యలు చేశారు. జనసేనతో బీజేపీ పొత్తు ఏపీకే పరిమితమని.. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని క్లారిటీ వచ్చారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశమే లేదని.. పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
‘మునుగోడు’ తరువాత మాస్టర్ ప్లాన్
తన కూతురు కవితను కూడా బీజేపీలో చేరాలని బీజేపీ పెద్దలు ఒత్తిడి చేశారని ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. ఈ అంశంపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ చుట్టూ తిరిగిన కేసీఆర్‌నే తాము పట్టించుకోలేదని.. కవితను ఎవరు పట్టించుకుంటారని సెటైర్లు వేశారు. కేసీఆర్ తన కూతురు కవితను రాజకీయాల్లోకి లాగడం దారుణమని అన్నారు. ఏదో దారిలో మళ్లీ అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ కలలు కంటున్నారని.. ఈసారి అలా కుదరదని స్పష్టం చేశారు.
Bandi Sanjay :
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ఢిల్లీకి వెళ్లి.. బీజేపీ పెద్దలతో భేటీ కావడంపై బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వారు తమ సొంత పనులపై ఢిల్లీకి వెళ్లారని తేల్చి చెప్పారు. బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారని.. ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశముందన్న ప్రచారం నేపథ్యంలో.. బండి సంజయ్ వాఖ్యలు సంచలనంగా మారాయి.