Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ మరలిరాని లోకాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.ఆయన గుండెపోటుతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నటశేఖరుడి మృతితో తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా లక్షలాది అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీంతో ఆయన పార్థీవదేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తారు.అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కంట్రోల్ చేయలేక లాఠీ చార్జి కూడా చేయాల్సి వచ్చింది.
అయితే నిన్న నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో లేరు. దీంతో ఆయన విషయం తెలిసినా కూడా వెంటనే వెళ్లలేకపోయారు.దీంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు. కాగా.. నేడు హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే బాలయ్య.. తన భార్య వసుంధర,కుమార్తె బ్రాహ్మిణితో కలిసి పద్మాలయ స్టూడియోస్‌కు వెళ్లి కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఘట్టమనేని కుటుంబ సభ్యులతో బాలయ్య మాట్లాడారు.అయితే తండ్రి పోయిన బాధలో మహేష్ బాబు మరింత కృంగిపోయారు.
అసలు గతంలోనే తన తల్లి, సోదరుల మరణంలో కృంగిపోయిన మహేష్.. ఇప్పుడు తనకు దైవ సమానమైన తండ్రి కూడా మరణించడంతో మరింత కృంగిపోయాడు. నిన్నటి నుంచి కూడా ఆయన చాలా ఆవేదనతో కనిపించారు. అయితే తీవ్ర విషాదంలో ఉన్న మహేష్ బాబు, ఆయన కుమారుడు గౌతంకృష్ణను ఒకానొక సందర్భంలో బాలయ్య నవ్వించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తండ్రి చనిపోయినప్పటి నుంచి విషన్న వదనంతో కనిపించిన మహేష్‌ను నవ్వు మొహంతో చూసిన అభిమానులు ఖుషీ అయిపోయారు. బాలయ్యకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.