unstoppable 2 : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వచ్చిన ‘అన్‌స్టాపబుల్ 2’షో అటు నందమూరి అభిమానులకు.. ఇటు నారా వారి అభిమానులకు మాంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. అన్‌స్టాపబుల్ 2కి గెస్ట్‌లుగా టీడీపీ అధినేత చంద్రబాబు,ఆయన తనయుడు నారా లోకేష్ వచ్చారు. అభిమామనులకు వారి ముగ్గురిని ఒకే వేదికపై చూడటం కన్నుల పండుగలా అనిపించింది. వీడియో కింద కామెంట్లతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌లపై ఉన్న అన్ని సందేహాలను ఈ షోలో బాలయ్య క్లియర్ చేసేశారు.
ఇప్పటికీ ఏపీలో అధికార వైసీపీ… మామను వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారంటూ చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నాయి. దీనికి చంద్రబాబు చేత ఆ రోజు అసలేం జరిగిందో చెప్పించారు. అలాగే బాలయ్య సైతం ఆ రోజున ఏం జరిగిందో తనకు గుర్తుందంటూ జరిగిన విషయాన్ని వెల్లడించారు. తన మాట వినమని ఎన్టీఆర్‌ను కాళ్లు పట్టుకుని అడుక్కున్నానని అయినా వినలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా అని బాలయ్యను సైతం చంద్రబాబు ప్రశ్నించారు.తన ఆరాధ్య దైవం ఎన్టీఆరేనని ఆయన ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని చంద్రబాబు షో సాక్షిగా స్పష్టం చేశారు.అమరావతిలో రాజధానిని నిర్మిస్తే అదంతా గ్రాఫిక్స్ అంటూ అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.ఈ విషయంపై బాలయ్య ఓ సెటైర్ వేశారు.
‘రాళ్లు, రప్పలున్నదాన్ని మహానగరంగా.. కొన్ని వేల కోట్ల టర్నోవర్ తీసుకొచ్చి సైబరాబాద్‌గా మార్చారు. అప్పటికి ఇంకా బాహుబలి రాలేదు కాబట్టి దాన్ని గ్రాఫిక్స్ అనలేదు’అని బాలయ్య సెటైర్ వేశారు. తనకు రాజశేఖర్‌రెడ్డితో ఎంత అనుబంధముందనే విషయాన్ని సైతం చంద్రబాబు చేత బాలయ్య చెప్పించారు. మొత్తానికి ఈ షో చంద్రబాబులోని ఒక ఫన్నీ యాంగిల్‌ను బయటకు తీయడమే కాకుండా..పొలిటికల్‌గా కూడా ఆయనకు బాగా ప్లస్ అయ్యేలా డిజైన్ చేశారనడంలో సందేహం లేదు. ఇక నారా లోకేష్.. మంగళగిరిలో పోటీ ఎందుకు చేయాల్సి వచ్చింది? తదనంతర పరిణామాలపై ఆయన చేతే బాలయ్య క్లారిటీ ఇప్పించారు. అనంతరం ఒక ఫోటో అసెంబ్లీలో సైతం బాగా వైరల్ అయ్యింది. ఆ పిక్ లోకేష్.. కొందరు విదేశీ భామలతో స్విమ్మింగ్ పూల్‌లో కనిపించడం. దానిని చూపించి కూడా బాలయ్య ఆ ఫోటో వెనుక ఉన్న అసలు విషయాన్ని చెప్పించారు.