Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. తాను డైరెక్షన్ చేస్తున్నట్లు చెప్పాడు. ఆదిత్య 369కు సీక్వెల్‌గా ఆదిత్య 999ను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో అభిమానుల్లో కొత్త జోష్ వచ్చింది. విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ 1.0 విడుదల కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చాడు. హీరోగా నటిస్తుండటంతో పాటు ఆ చిత్రానికి విశ్వక్ దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. అతడు చేసిన వర్క్ గురించి చెబుతూ ‘ఆదిత్య 999 మ్యాక్స్’ విషయం చెప్పేశాడు బాలయ్య.
ఆ ఫంక్షన్‌లో బాలయ్య ఏం చెప్పాడంటే.. ‘నేను ఒక సినిమా డైరెక్ట్ చేద్దామనుకున్నాను. కానీ, నా వల్ల కాలేదు. మధ్యలో ఆ సినిమా ఆగిపోయింది. అది నర్తనశాల. ఆ తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు. నాకు టైమ్ లేదు. కొన్ని సబ్జెక్టులు తట్టలేదు’ అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ మీ దర్శకత్వంలో సినిమా లేదా? అంటూ వేదిక కింద ఉన్న అభిమానులు అడిగితే… ‘ఉంది ఉంది తప్పకుండా! ‘ఆదిత్య 999’ ఉంది’ అని బాలకృష్ణ చెప్పారు. దాంతో ఆయన దర్శకత్వంలో ఆ సినిమా రూపొందనుందని క్లారిటీ వచ్చింది.
‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్ వస్తే చూడాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. బాలకృష్ణ కూడా సీక్వెల్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. ఆయన వందో సినిమాగా అదే చేస్తారని వినిపించింది. అయితే… కుదరలేదు. ఇప్పుడు ఆ సినిమా పట్టాలు ఎక్కే సమయం వచ్చిందని బాలకృష్ణ మాటలను బట్టి అర్థం అవుతోంది.
వచ్చే ఏడాది సెట్స్ మీదకు!
వచ్చే ఏడాది ‘ఆదిత్య 999 మాక్స్’ సెట్స్ మీదకు వెళ్లనుందని, రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని బాలకృష్ణ వెల్లడించాడు. మరో నాలుగు నెలల తర్వాత… ఫిబ్రవరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయట. ఇందులో బాలకృష్ణతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా నటించే అవకాశాలు ఉన్నాయని వినికిడి.
Balakrishna:
బాలకృష్ణ కెరీర్‌లో కొన్ని స్పెషల్ సినిమాలు ఉన్నాయి. అందులో ‘ఆదిత్య 369’ది మరీ మరీ స్పెషల్ ప్లేస్. కంటెంట్, టెక్నాలజీ పరంగా హాలీవుడ్ స్థాయి సినిమా అది. దానికి సీక్వెల్ ‘ఆదిత్య 999 మ్యాక్స్’ తెరకెక్కించనున్నట్లు ‘అన్‌స్టాపబుల్ 2’ ఎపిసోడ్‌లో బాలకృష్ణ ఇప్పటికే చెప్పాడు. స్క్రిప్ట్ తానే రాస్తున్నానని కూడా వెల్లడించాడు. అయితే ఆ తర్వాత దానిగురించి మళ్లీ మాట్లాడలేదు. ఇప్పుడు ధమ్కీ ట్రైలర్ ఈవెంట్‌లో ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.