Bigg boss 6: ‘బిగ్ బాస్’ సీజన్ 6 ఆరోవారం కూడా పూర్తై పోయింది. ఆదివారం హోస్ట్ నాగార్జున నాటు నాటు సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చారు. అందరినీ చక్కగా పలకరించి ఆ తరువాత బిగ్‌బాస్ ముద్దుబిడ్డ గీతూతో కాసేపు నాగ్ ఆడుకున్నారు. ఈ క్రమంలోనే చెల్లిపై మన రేలంగి మామయ్య కామెంట్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. బాలాదిత్య ఇలా కూడా సెటైర్లు వేస్తాడా? అనిపించింది. అసలే మనోడు మర్యాద రామన్నకు అన్న అలాంటి వ్యక్తి కామెంట్ చేయడం ఏంటా? అని ఆశ్చర్యమేసింది. కానీ చెల్లి కదా.. చెల్లిని అన్న కాకుంటే ఎవరు ఆట పట్టిస్తారు.
నాగ్ ఎంట్రీ ఇవ్వగానే హౌస్‌మేట్స్‌ను పలకరించి అనంతరం రేవంత్‌కు స్టోర్ రూమ్‌కు వెళ్లాలని చెప్పారు. గీతూ నోరు ఊరుకోదు కదా.. ‘సార్, రేవంత్‌కి కాలు బాగాలేదు, ఈసారికి ఎవరినైనా పంపండి’ అని చెప్పింది. నాగ్ ఊరుకుంటారా? ఎవరో ఎందుకు నువ్వే వెళ్లు అని గీతూనే బుక్ చేశారు. గీతూ చాలా బద్ధకంగా లేచి నడుస్తుంటే వయసొచ్చిన చిరుతలా ఉన్నావు అంటూ నాగ్ సెటైర్ వేశారు. దీనికి బాలాదిత్య వయసు అయిపోయిన చిరుత అంటూ కౌంటర్ ఇచ్చాడు. అన్నయ్య నువ్వు చెల్లిని అలా అంటున్నావా అంటూ నాగ్ అవాక్కయ్యారు.
ఇక స్టోర్ రూమ్ నుంచి తెచ్చిన క్లోజ్డ్ బోర్డ్స్‌తో తొలుత ఆదిరెడ్డి సేఫ్ అయ్యారు. ఇక సన్‌డే ఎలాగూ ఫన్ డే కాబట్టి.. ‘బొమ్మలతో పాట’ అనే ఆటను హౌస్‌మేట్స్‌తో ఆడించారు. ఈ గేమ్ మంచి ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. ఆటల మధ్యలో ఒక్కొక్కరినీ సేఫ్ చేస్తూ వచ్చారు నాగ్. చివరకు గీతూ, బాలాదిత్య, సుదీప మిగిలారు. గీతూని కూడా సేఫ్ చేశారు. ఫైనల్‌గా బాలాదిత్య, సుదీపకు రెండు బ్యాటరీలు ఇచ్చారు. వాటిలో ఉన్న చార్జింగ్‌ను బట్టి ఎవరి సేఫ్ అనేది తేలిపోతుందని నాగ్ చెప్పారు. సుదీప బ్యాటరీలో తక్కువ చార్జింగ్ ఉండటంతో ఆమె ఎలిమినేట్ అయిపోయింది.