AUS v/s SL: T20 వరల్డ్ కప్ లో భాగంగా పెర్త్ వేదికగా నేడు ఆస్ట్రేలియా- శ్రీలంక జట్ల మధ్య T20 మ్యాచ్ జరిగింది. సూపర్ -12 ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడిన ఆస్ట్రేలియా జట్టు ఓటమి పాలైన సంగతి మనకు తెలిసిందే. కానీ నేడు జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు తిరిగి పుంజుకుంది. నెదర్లాండ్స్ జట్టుపై గెలిచి ఊపుమీదున్న శ్రీలంక జట్టును చిత్తుగా ఓడించింది. స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోనిస్ మెరుపు హాఫ్ సెంచరీతో (18 బంతుల్లో 59 నాటౌట్; 4ఫోర్లు, 6 సిక్సర్లు) విజృంభించడంతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు శ్రీలంక జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన పతున్ నిస్సంక 2 ఫోర్ల సహాయంతో 45 బంతుల్లో 40 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కుషల్ మెండిస్ 5 పరుగులకే కమ్మిన్స్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన ధనుంజయ జట్టును ఆదుకున్నాడు. 3 ఫోర్ల సహాయంతో 23 బంతుల్లో 26 పరుగులు చేసి ఆగర్ బౌలింగ్ లో వార్నర్ కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత వచ్చిన అసలంక 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 బంతుల్లో 38 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
157 పరుగుల లక్ష్య చేధనకు ఆస్ట్రేలియా నుంచి డేవిడ్ వార్నర్ మరియు ఆరోన్ ఫించ్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ డేవిడ్ వార్నర్ 10 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి తీక్షణ బౌలింగ్ లో శ్రీలంక కెప్టెన్ షనకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన మిచెల్ మార్ష్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తో కలిసి స్కోరు బోర్డును ముందుకు పరుగెత్తించాడు. రన్ రేట్ లో అందరి కంటే వెనక ఉన్న ఆస్ట్రేలియా జట్టు గ్లెన్ మాక్స్ వెల్ రాకతో ఇన్నింగ్స్ వేగాన్ని పెంచింది. ధాటిగా ఆడిన మాక్స్ వెల్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 23 పరుగులు చేసి కరుణరత్నే బౌలింగ్ లో అవుటయ్యాడు.
AUS v/s SL
ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన మార్కస్ స్టోనిస్ ఆద్యంతం శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వరస సిక్సర్లతో 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున T20 వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 18 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులతో 59 పరుగులు చేసాడు. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ 42 బంతుల్లో 31 పరుగులు చేశాడు. స్టోనిస్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా జట్టు 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన మార్కస్ స్టోనిస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు.