ప్రపంచంలో ఒక్కొక్కరికీ ఒక్కో రా ఒక పిచ్చి ఉంటుంది. దానిని వారు సరదా కోసం అని, అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నం అని కూడా చెబుతూ ఉంటారు. ఏదో ఒకటి చేసి తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. దానికోసం కొందరు సినిమా సెలబ్రిటీలుగా మారుతారు. కొందరు వ్యాపారంలో రాణిస్తారు. మరికొందరు తమ జీవన విధానంలో సరికొత్త మార్పులు చేసుకొని సమాజం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఏదో ఒక సమయానికి ఆ రికార్డును అందుకుంటారు.
కొందరు ఒంటినిండా పచ్చబొట్లు వేసుకుంటారు. మరికొందరు శరీరంలో గోళ్ళు విపరీతంగా పెంచి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. అలాగే సంవత్సరాల తరబడి స్నానం చేయకుండా రికార్డ్ సృష్టించిన వాళ్లు కూడా ఉన్నారు. అలాగే ఆహారం తీసుకోకుండా కేవలం ద్రవ పదార్థాలతో జీవిస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి కోవకు చెందిన ఓ మహిళ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్లోరిడాకు చెందిన ఆశా మండేలా అనే మహిళ ఏకంగా 110 అడుగుల పొడవైన జుట్టును పెంచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.
ఈమె 2009 సంవత్సరంలో 19 అడుగుల పొడవైన జుట్టు ఉన్న మహిళగా రికార్డు నమోదు చేసుకుంది. మరల పద్నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఏకంగా 110 అడుగుల పొడవైన జుట్టుతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఈమె తన జుట్టుని కిరీటంగా భావిస్తుంది. తల స్నానం చేసినప్పుడు కనీసం 6 బాటిల్స్ షాంపూలు అవసరం అవుతాయని చెప్పింది. అలాగే జుట్టు ఆరడానికి ఏకంగా రెండు రోజుల సమయం పడుతుందని చెప్పింది. ఈ జుట్టు పెంచడం వలన తనకి ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం వచ్చాయని ఈమె పేర్కొంది. ఏకంగా 46 ఏళ్ల నుంచి ఈ పొడవైన జుట్టుని ఆమె పెంచుతూ ఉండటం విశేషం.