Ap Politics: బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో తెలుగుదేశం పార్టీ మరోసారి చేరిక అంశంపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఈ విషయంపై ఓ సమావేశంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. 2018లో బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని, కమలం పార్టీని లక్ష్యంగా చేసుకుని జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో చేతులు కలిపారు.
కానీ 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన అనంతరం మౌనం వహించిన టీడీపీ పార్లమెంటులో ఎన్డిఎ ప్రభుత్వానికి తన మద్దతును అందించింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో కూడా కాషాయ పార్టీకి మద్దతు ఇచ్చింది. టిడిపి నాయకత్వం మరోసారి బిజెపితో చేతులు కలపాలని భావిస్తున్నట్లు చాలా కాలంగా ఊహాగానాలు ఉన్నప్పటికీ గత నెలలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో మోడీ, చందబ్రాబుల మధ్య కొద్దిసేపు పరస్పర చర్చ జరగడంతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Ap Politics: మళ్లీ చేతులు కలిపేందుకు టీడీపీ, బీజేపీ సిద్ధం?
ఏపీలో జనసేన మినహా ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు ఉండదని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ టీడీపీ, బీజేపీ మళ్లీ చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నాయని పలువురు రాజకీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం కేంద్ర ప్రభుత్వంతో ఎంతో సఖ్యతతో ముందుకు సాగుతున్నారు. కమలం పార్టీతో ప్రత్యక్షంగా వైసీపీ కలవకపోయినప్పటికీ పరోక్షంగా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ వస్తోంది.
ఇలా ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనలు కమలదళంతో దోస్తీకి సుముఖత చూపుతున్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు ఏవిధంగా ముందుకు సాగనున్నాయి. టీడీపీ,బీజేపీతో పొత్తు కుదుర్చుకుని అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తుందా..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!