AP Government : 3 రాజధానులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును.. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ సవాల్ చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు తీర్పును వెలువరించింది. అలా చేయడమంటే శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ సర్కార్ పేర్కొంది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంటూ.. హైకోర్టు సూచించడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని సర్కార్ పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులని పిటిషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది.
హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ సర్కార్ తెలిపింది. కాగా.. మూడు రాజధానుల బిల్లు (3 Capitals Bill)ను వెనక్కి తీసుకుంటున్నట్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్న విషయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రాజధానుల అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏజీ దాఖలు చేసిన అఫిడవిట్ లో పొందుపర్చారు. కాగా.. తిరిగి తాజాగా మూడు రాజధానుల అంశాన్ని లేవనెత్తారు. ఎలాగైనా సరే రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుందో వేచి చూడాలి.
AP Government : సీఆర్డీఏను రద్దు చేస్తూ చట్టం..
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయని 2019 డిసెంబర్ 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత మండలిలో ప్రవేశపెట్టారు. అక్కడ ఆమోదం పొందకపోవడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీనిపై రాజధాని రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఓ దశలో అమరావతి ప్రాంతం రణరంగంగా మారింది. మొత్తంగా మూడు రాజధానుల అంశం హైకోర్టుకు చేరింది. దీంతో ఆ అంశాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. తిరిగి ఇప్పుడు మళ్లీ కథ మొదటికి వచ్చింది.