POLITICS: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందరికీ తెలిసిందే..! రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనుమరుగైంది. అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ పార్టీ కనీసం ఉనికి చాటుకునే పరిస్థితిలో లేదు. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన సీనియర్ నాయకులు అందరూ ఇతర పార్టీల చెంతకు చేరిపోయారు.
ఏపీలో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా పట్టు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మరలా పురుడు పోసేందుకు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆయన భారత్ జోడో యాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈనెల 18న ఏపీలోకి ప్రవేశించనుంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తయింది. ప్రస్తుతం కర్ణాటకలో పాదయాత్ర కొనసాగుతోంది. అక్కడ పూర్తిచేసుకొని యాత్ర ఏపీలోకి ప్రవేశించనుంది.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ఏం చేయనున్నారు అనే హామీలను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై తొలి సంతకం. విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చడం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్. రైతులకు ఎటువంటి షరతులు లేకుండా రూ.3,00,000 రుణమాఫీ, రాయలసీమ మరియు ఉత్తరాంధ్రకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజి. అత్యంత పేద వర్గాలకు న్యాయ్ పథకం ద్వారా నెలకు రూ.6,000 అలా సంవత్సరానికి రూ.72,000 ఆర్థిక సహాయం.
ఇలా ప్రజలు అవాక్కయేలా కాంగ్రెస్ పార్టీ హామీలను ఇచ్చింది. మరి ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఫిదా అవుతారా..? ఒకవేళ ఫిదా అయినా ఏపీలో ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీని కాదని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా…? ఏపీలో ప్రజలు ఓట్లు వేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ కేంద్రలో అధికారంలోకి రాదు. మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఆ పార్టీని ఆదరించాల్సి ఉంటుంది.