తెలుగుదేశం పార్టీ తో ఎన్నికల పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పారు.
బుధవారం ఓ వర్గం మీడియాలో వచ్చిన కథనాలపై స్పందిస్తూ.. బీజేపీని కించపరిచిన వ్యక్తితో చేతులు కలిపే ప్రసక్తే లేదని అన్నారు. ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరేది చంద్రబాబు నాయుడేనని, ఇప్పుడు కోరేది కూడా ఆయనేనని ఆయన అన్నారు. “ప్రధానులను మారుస్తానని, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నాడని గొప్పలు చెప్పుకుంటున్నాడు. విశాఖకు రైల్వే జోన్ అప్పుడు ఎందుకు రాలేదు. నోటాతో పోటీ పడుతున్నామని చెప్పిన ఆయన బీజేపీతో ఎన్నికల అవగాహన ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు.
రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా నిషేధం విధించిన చంద్రబాబుకు ఇప్పుడు శాంతిభద్రతలపై మాట్లాడే అర్హత లేదని వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉంటే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయా? తిరుపతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై దాడి జరిగినప్పుడు ఏమైనా చర్యలు తీసుకున్నారా?’’ అని ప్రశ్నించారు.