Telangana News : మునుగోడు ఉపఎన్నికలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు.. ఎప్పుడు ఏ పార్టీ మారుతారో తెలియకుండా ఉంది. ఇవాళ ఈ పార్టీలో ఉన్నారు అనుకున్న వ్యక్తులు రేపు ఉండటం లేదు. అంతెందుకు దగ్గరుండి అభ్యర్థి చేత నామినేషన్ వేయించిన అభ్యర్థులు సైతం తెల్లవారి పాటికే పార్టీ మారిపోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ కీలక నేత తమ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసిన సమయంలోనూ పక్కనే ఉన్నారు. కానీ ఆ తరువాతే వెంటనే వెళ్లి ఢిల్లీలో కూర్చొని పార్టీ మారుతున్నట్టు ప్రకటించేశారు.
ఇక ఆయనతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు సైతం పార్టీ మారుతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికైతే అందరి చూపూ బీజేపీ వైపే ఉంది. టీఆర్ఎస్‌పై ప్రల్లో చాలా అసంతృప్తి ఉందని తెలుసుకున్న నేతలు పార్టీ మారేందుకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని సైతం ఇప్పట్లో కాపాడే నాథుడే లేడని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు కూడా బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇక పార్టీ మారనున్న వారిలో కాంగ్రెస్ నేత కుమారుడు, ఒక మాజీ మంత్రి కుమారుడు అలాగే మరో నేత ఉన్నట్టు తెలుస్తోంది. బూర నర్సయ్య గౌడ్ బీజేపీ కండువా కప్పుకునే రోజునే వీరంతా కూడా పార్టీ కండువా కప్పుకోనున్నారు. పార్టీ మారే వారిలో కాంగ్రెస్ నేత వడ్డేపల్లి నర్సింగ్‌రావు కుమారుడు కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన వడ్డేపల్లి రాజేశ్వర్‌రావు, వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కుమారుడు నరేశ్ ముదిరాజ్‌తో పాటు మహబూబ్‌నగర్‌కు చెందిన మరో నేత ఉన్నారు. తెలంగాణ నేతలు బీజేపీలో చేరుతున్న కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ఛుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ తదితరులు హాజరు కానున్నారు.