Andhra Pradesh : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయి ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడి 8 ఏళ్లు అవుతోంది. 2014 సంవత్సరం నుంచి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తమ తమ పరిపాలనను కొనసాగిస్తున్నాయి. అయితే ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయినా చాలా ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆస్తులు , అప్పుల విభజన జరగలేదు. ఈ నేపథ్యంలో మా వాటా మాకు ఇప్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది. తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తులు, అప్పుల్లో తమ వాటాను ఇప్పించాలని ఏపీ సర్కార్ సుప్రీమ్ కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాలు భౌతికంగా విడిపోయి 8 ఏళ్లు అవుతున్నా ఇంకా ఆస్తుల పంపిణీ జరగకపోవడంతో ఏపీలో ఆర్ధికాభివృద్ధిం అంతంతగానే ఉంటోంది. షెడ్యూల్ – 9 లోని 91 సంస్థలు, షెడ్యూట్ 10లోని 142 సంస్థలతో పాటు చట్టంలో లేని 12 సంస్థల్లో ఏ ఒక్కదాంట్లో కూడా ఇప్పటి వరకు రాష్ట్రాల మధ్య పంపిణీ జరుగలేదు. ఈ ఆస్తుల విలువ సుమారు రూ. 1,42,601 కోట్లు ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఒకప్పటి రాజధాని ఇప్పటి తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనే అభివృద్ధి వేగవంతంగా జరిగింది. ఇక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు , సంక్షేమ పథకాలు అమలు అయ్యేవి. ప్రస్తుతం హైదరాబాద్ తెలంగాణలో ఉండటంతో తెలంగాణకు ప్రయోజనం కలుగుతుందే కానీ ఆస్తుల విభజన జరగని కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాధమిక, రాజ్యాంగ హక్కులకు భగం ఏర్పడుతుందని గుర్తించిన ఏపీ సర్కార్ సుప్రీం ను ఆశ్రయించింది. మా వాటాను మాకు అందించి ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాలని విన్నవించింది.