Amith Shah : సౌత్‌లో బీజేపీ ఎంట్రీ ఇచ్చేందుకు తెలంగాణ గేట్ వే అవుతుందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తాజాగా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు వింటే ఏంటా ధీమా? అన్న అనుమానం కలుగక మానదు. తెలంగాణలో తాము ఎలాగైనా అధికారంలోకి వచ్చేస్తామనే ధీమాతో ఉన్నారా? లేదంటే తెలంగాణ ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నమా? అని అనిపించక మానదు. ఓ జాతీయ మీడియా సదస్సులో పాల్గొన్న హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణలో బీజేపీ పాగాపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జాతీయ సదస్సులో అమిత్ షా మాట్లాడుతూ… తెలంగాణ పల్స్ తనకు తెలుసని అమిత్ షా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తప్పకుండా బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ అధికార పీఠాన్ని అత్యధిక సీట్లతో కైవసం చేసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని అమిత్ షా వెల్లడించారు. తెలంగాణలో ఈసారి తప్పని సరిగా తెలంగాణ ప్రజల్లో మార్పు వస్తుందని.. అదే తమకు తప్పనిసరిగా అధికారాన్ని కట్టబెడుతుందన్నారు.
ఇక జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తానే స్వయంగా రంగంలోకి దిగుతానని.. బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని అమిత్ షా పేర్కొన్నారు. తనకు ముఖ్యంగా కింది స్థాయి వరకు ప్రజల నాడి తెలుసన్నారు. ఒకవైపు మునుగోడు ఎన్నికల్లో బొక్కబోర్లా పడి ఎన్నో రోజులు కాక మునుపే అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తెలంగాణలో ఇప్పటికే బీజేపీకి గాలి వీస్తోందని.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. ఒకవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మరోవైపు అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.