Allu Aravind : అటు మెగా.. ఇటు అల్లు వారి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పారు టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో అల్లు అరవింద్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా గురించి ఏ అప్‌డేట్ వచ్చినా.. లేదంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఏ అప్‌డేట్ వచ్చినా ఫ్యాన్స్ మైమరచిపోతారు. అలాంటిది వీళ్లిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తుందంటే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్‌కి పూనకాలు రావడం ఖాయం కదా. ఈ ఇద్దరి కాంబోలో సినిమాను తెరకెక్కించబోతున్నట్టు అల్లు అరవింద్ వెల్లడించారు.
ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి భవిష్యత్తులో ఎలాంటి సినిమాలను ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు? అన్న ప్రశ్నకు అల్లు అరవింద్.. మెగా, అల్లు వారి ఫ్యాన్స్‌కు నచ్చే మెచ్చే సమాధానం ఇచ్చారు. ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో తెలియదని.. గీతా ఆర్ట్స్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి సినిమా చేయాలనేది తన కోరిక అని పేర్కొన్నారు. అంతటితో ఆగారా? సినిమా టైటిల్‌ను కూడా చెప్పేశారు. ఈ మల్టీస్టారర్ కాంబినేషన్‌కి పదేళ్ల క్రితమే చరణ్ – అర్జున్ అనే టైటిల్‌ను ఎప్పుడో రిజిష్టర్ చేశానని వెల్లడించారు. మొత్తానికి అల్లు అరవింద్ టైటిల్ కూడా చెప్పేశారు.
రిజిష్టర్ చేసైతే అలా వదిలేయలేదని.. ఎప్పటి ఆ టైటిల్‌ను ఇప్పటి వరకు రెన్యువల్ చేస్తూనే ఉన్నానని అల్లు అరవింద్ తెలిపారు. ప్రస్తుతానికైతే వీరిద్దరి కాంబో కోసం ఇంకా కథలను వినట్లేదని.. త్వరలోనే ఆ పని కూడా చేస్తానన్నారు. నిజానికి అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో కనిపించారు. కానీ పూర్తి స్థాయిలో ఒక మల్టీస్టారర్ చేస్తే చూడాలని వీరిద్దరి అభిమానుల కోరిక. అల్లు అరవింద్ మాటలు చూస్తే త్వరలోనే ఆయన కోరిక నెరవేరేలాగే కనిపిస్తోంది.