Telangana : తెలంగాణలో ఇక మీదట అన్నీ జాతీయ పార్టీలే కాబోతున్నాయి. ఒక్క వైఎస్ఆర్‌టీపీ, టీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలన్నీ జాతీయ పార్టీలే కావడం గమనార్హం. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్‌గా పేరు మార్చుకుని జాతీయ పార్టీగా అవతరించబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వేళ్లూనుకుపోయింది. మరోవైపు బీజేపీ ఇప్పుడిప్పుడే బలపడేందుకు సిద్ధమవుతోంది. ఇక సీపీఎం, సీపీఐలు ఉండనే ఉన్నాయి. ఇక రేపో మాపో.. బీఆర్ఎస్ రాబోతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సారధ్యంలో టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారబోతోంది. అంతేకాదు.. ఆశ్చర్యకరంగా మునుగోడు ఉపఎన్నిక నాటికి జాతీయ పార్టీగా అవతరిస్తుంది కాబట్టి.. అక్కడ మూడు జాతీయ పార్టీలు తలపడనుండటం గమనార్హం.
ఈ క్రమంలోనే తమ పార్టీ పేరును సైతం మార్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం కూడా ఖరారై పోయింది. ఇక టీఆర్ఎస్ పార్టీ గుర్తే బీఆర్ఎస్‌కు కూడా కొనసాగనుంది. అలాగే జెండా కూడా అదే కొనసాగించనున్నారు కేసీఆర్. మరి ఎన్నికల సంఘం వీటన్నింటికి అనుమతిస్తుందో లేదో చూడాలి. ఇప్పటికే సీఎం కేసీఆర్ నిన్న (ఆదివారం) తమ పార్టీ నేతలకు జాతీయ పార్టీ గురించి వివరాలు వెల్లడించనున్నారు. మొత్తానికి యువత, దళితులు, మధ్య తరగతి వర్గాల ప్రజలను టార్గెట్ చేస్తూ ఈ పార్టీ రంగంలోకి దిగనుందని టాక్.
Telangana : పార్టీ తీర్మానంపై 283 మందితో సంతకాలు
ఇప్పటికే సీఎం కేసీఆర్ తమ పార్టీ నేతలతో పలు మార్లు జాతీయ పార్టీ విషయమై చర్చలు నిర్వహించారు. ఈ పార్టీ ప్రకటనకు ముందు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని కుటుంబంతో సహా వెళ్లి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ఒక కేజీ 16 తులాల బంగారాన్ని సమర్పించారు. ఇక దసరా రోజున పార్టీకి అవసరమైన పత్రాలను సిద్ధం చేసి తీర్మానం చేయనున్నారు. అదే రోజు పార్టీ ఏర్పాటుకు సంబంధించిన తీర్మానంపై 283 మందితో సంతకాలు చేయించనున్నారు. ఇక దసరా తదుపరి రోజున పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అనంతరం తెలంగాణలోని కరీంనగర్‌లో ఒక భారీ బహిరంగ సభ, అలాగే ఢిల్లీలో ఒక భారీ బహిరంగ సభను సీఎం కేసీఆర్ నిర్వహించనున్నారు.