దర్శకుడు తేజ గురించి పరిచయం చేయాలంటే చిత్రం, నువ్వు నేను, జయం సినిమాల గురించి ముందు చెప్పాలి. కొత్త నటులతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లని అందుకున్న దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. యువతరానికి బాగా కనెక్ట్ అయ్యే ప్రేమకథలని ఎంచుకొని, ఫైనల్ గా ప్రేమ కోసం హీరో బలమైన విలన్ తో పోరాడేవాడిగా ప్రెజెంట్ చేసి ప్రేక్షకులని మెప్పించి సక్సెస్ అందుకున్నాడు. అయితే తరువాత కూడా అదే ఫార్ములా కథలతో సినిమాలు చేయడంతో ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. దీంతో వరుసగా ఫ్లాప్ లు వచ్చాయి.
ఈ కారణంగా మధ్యలో కొంత కాలం గ్యాప్ తీసుకొని నేనే రాజు నేనే మంత్రి సినిమాతో కమర్షియల్ దర్శకుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తరువాత మళ్ళీ తేజ నుంచి చెప్పుకోదగ్గ హిట్స్ అయితే పడలేదు. మళ్ళీ గ్యాప్ తీసుకొని తన పాత స్టైల్ కి కాస్తా క్రైమ్ ని జోడించి సరికొత్తగా దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేయబోతున్నాడు దర్శకుడు తేజ. అహింస టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనికోసం తన పాత టీమ్ మేట్స్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పి పట్నాయక్, కెమెరామెన్ సమీర్ రెడ్డి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావులతో కలిసి పని చేస్తున్నాడు.
ఈ సినిమాతో అభిరామ్ కి జోడీగా గీతిక అనే అమ్మాయిని తీసుకున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. ఇందులో ముఖానికి గోనెసంచి కట్టి ఉన్న అభిరామ్ ని తీసుకొని నక్సలైట్స్ అడవిలో వెల్తూ ఉంటే వారి నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో వారు అతనిపై ఎటాక్ చేసి రక్తం వచ్చేలా కొడతారు. ఈ గ్లిమ్ప్స్ తో సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తేజ చెప్పే ప్రయత్నం చేసాడు. మరి ఈ మూవీతో తేజ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.