కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలని తలక్రిందులు చేసేసింది. ఉపాధి అవకాశాలు దూరం చేసింది. ఎన్నో కంపెనీలు ఆర్ధిక ఇబ్బందుల కారణంగా దివాలా తీశాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే అన్ని గాడిలో పడుతున్నాయి. ఇక కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమ మీద కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించింది. రెండేళ్ల పాటు సినిమా షూటింగ్ లు అన్ని బంద్ అయిపోవడంతో జూనియర్ ఆర్టిస్ట్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ వరకు అందరూ ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డారు. సీరియల్స్, సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా మంచి ఫేమ్ ఉన్న వారు కూడా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది, అలాగే ఇంటి అవసరాల కోసం కొంతమంది రోడ్డు మీదకి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు కూడా స్టార్ట్ చేశారు.
తాజాగా మలయాళీ చిత్ర పరిశ్రమలో ఒక నటి కరోనా ప్రభావంతో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా లాటరీ టికెట్లు అమ్ముకునే స్థాయికి పడిపోయింది. ప్రముఖ మలయాళీ నటి మేరీ 35 సినిమాల వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. అందులో చాలా వరకు గుర్తుండిపోయే పాత్రలే కావడం విశేషం. నివిన్ పోలీ హీరోగా వచ్చిన బిజూ మూవీతో ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. నటిగా మంచి అవకాశాలు రావడంతో చేతినిండా ఆదాయం ఉండేది. అలా వచ్చిన డబ్బుతో కూతురు పెళ్లి గ్రాండ్ గా చేసింది. అలాగే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండేది.
అయితే ఒక్కసారిగా కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ లు ఆగిపోవడంతో సంపాదించిన డబ్బు అంతా ఖర్చయిపోయింది. కుటుంబాన్ని పోషించుకోవడానికి నటన తప్ప వేరే ఆదాయం లేదు. అలా అని అవకాశాలు కూడా రావడం లేదు. దీంతో మరో ప్రత్యామ్నాయం లేక లాటరీ టికెట్లు అమ్మడం ప్రారంభించింది. దీని ద్వారా రోజుకి వచ్చే 300 రూపాయలతో కుటుంబాన్ని పోషిస్తుంది. ఇక తన కొడుకు కూడా అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితం అవడంతో అతని మెడిసన్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఏదో ఉన్నంతలోనే ఈమె ఆ చిన్న ఆదాయంతోనే బ్రతుకుతుంది. నిర్మాతలు దయతలచి తనకి నటిగా అవకాశాలు ఇస్తే మళ్ళీ తన ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయనే ఆశతో ఆమె బ్రతుకుతుంది.