Abhishek : సాధారణ హీరో అయితేనేమి.. స్టార్ హీరో అయితే ఏమీ.. తండ్రిపై జోక్స్ వేస్తే వింటూ ఎంజాయ్ చేస్తారా? మండిపోతుంది కదా. అదే జరిగింది అభిషేక్ బచ్చన్‌కు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అభిషేక్ బచ్చన్. ఇక బాలీవుడ్‌లో రితేశ్ దేశ్‌ముఖ్, కుష కపిల హోస్ట్‌లుగా ‘కేస్ తో బన్ తా హై’అనే టాక్ షో నడుస్తోంది. ఇప్పటికే విక్కీ కౌశల్, సారా అలీఖాన్, సంజయ్ దత్ తదితరులు వచ్చి ఈ షోలో సందడి చేశారు.
తాజాగా ఈ షోకు అభిషేక్ బచ్చన్ వచ్చాడు. ఈ షోలో అమితాబ్‌పై జోక్ వేయడంతో అభిషేక్ మండిపడ్డాడు. తానేమీ ఫూల్ కాదంటూ తన తండ్రిపై జోక్ వేస్తే తనకు నచ్చదని సీరియస్‌గా చెప్పి షో నుంచి వెళ్లిపోయాడు. దీంతో రితేశ్ దేశ్‌ముఖ్, కుష కపిల షాక్ అయ్యారు. నిజానికి ఇండస్ట్రీలోనే అభిషేక్‌కు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కూలెస్ట్, కామెస్ట్ యాక్టర్‌గా పేరుంది. అలాంటి అభిషేక్‌కే కోపం వచ్చిందంటే.. తన తండ్రి విషయంలో ఆయన ఎంత సీరియస్‌గా ఉంటాడో అర్ధమవుతోంది.
అసలేం జరిగిందంటే.. అమెజాన్ మినీ టీవీలో ప్రసారం అవుతున్న ‘కేస్ తో బన్ తా హై’అనే టాక్ షోకు అభిషేక్ గెస్ట్‌గా వచ్చాడు. ఈ షోలో పరితోష్ త్రిపాఠి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌పై జోక్ వేశాడు. దీంతో ఫైర్ అయిన అభిషేక్.. తన తల్లిదండ్రులను షోలోకి లాగొద్దని.. హద్దులు దాటొద్దని హెచ్చరించాడు. తనపై జోక్స్ వేస్తే తీసుకుంటానని.. కానీ తన తండ్రిపై జోక్ వేస్తే మాత్రం తీసుకోలేనని స్పష్టం చేసి అక్కడి నుంచి వెళుతుండగా.. పరితోష్ సర్ది చెప్పేందుకు యత్నించారు. అయినా అభిషేక్ వినలేదు. చివరకు మేకర్స్ సైతం కల్పించుకున్నా లెక్క చేయకుండా షో నుంచి వెళ్లిపోయాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.