టిఎస్‌ఆర్‌టిసి విలీన బిల్లుకు ఆమోదం తెలపడంలో గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ చేసిన జాప్యాన్ని నిరసిస్తూ వివిధ ఆర్టీసీ సంఘాల సభ్యులు, ఉద్యోగులు శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో గవర్నర్ ఆమోదం కోసం పంపిన బిల్లుపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి ఆర్టిసి ఉద్యోగులు, పురుషులు, మహిళలు బస్ డిపోల వద్ద నినాదాలు చేశారు.
ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రెండు గంటల పాటు నిరసన తెలిపినా, కొన్ని డిపోల వద్ద ఉదయం 8 గంటలకు మించి నిరసన కొనసాగింది. ముషీరాబాద్‌తోపాటు పలు డిపోల్లోని బస్సులు డిపోల వద్దే నిలిచిపోయాయి.
తెలంగాణ గవర్నర్ తమ సమస్యల పట్ల వెంటనే స్పందించి ఆర్టిసి బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సులను డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు. ఉదయాన్నే విద్యాసంస్థలకు కార్యాలయాలకు వెళ్లేవారు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఉదయం 10 గంటలకు పివిఎన్‌ఆర్ మార్గ్‌కు తరలివచ్చి 11 గంటలకు రాజ్‌భవన్ వద్ద ధర్నాకు దిగాలని కార్మిక సంఘాలు ఆర్టిసి ఉద్యోగులందరికీ పిలుపునిచ్చాయి. దీంతో నగరవాసులకు ఈ మధ్యాహ్నం వరకు ప్రయాణ కష్టాలు కొనసాగనున్నాయి.
- Read Latest Political News and Entertainment