హైదరాబాద్ నగరంలో అత్యాధునిక వసతులతో మరో థియేటర్ కాంప్లెక్స్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇంతకుముందు మహేశ్‌బాబుతో కలసి ఏషియన్ సినిమాస్ సంస్థ ‘ఏఎంబీ’ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్‌ను నిర్మించింది. అది హైదరాబాద్ నగరానికే ఐకానిక్ థియేటర్లుగా మారాయి. ముఖ్యంగా సినిమా వాళ్ల మనసు దోచుకున్న థియేటర్ల సముదాయం అది.
ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలసి ఏషియన్ సినిమాస్ సంస్థ నిర్మించిన ‘ఏఏఏ సినిమాస్’ మల్టీప్లెక్స్ థియేటర్స్ ప్రదర్శనల కోసం ముస్తాబయింది. అమీర్‌పేట్‌లో ఇంతకుముందు ఉన్న సత్యం థియేటర్‌ను కూలగొట్టి ఈ థియేటర్ల సముదాయాన్ని నిర్మించారు నిర్మాత, పంపిణీదారుడు సునీల్ నారంగ్. ఈ థియేటర్ ప్రత్యేకతలను బుధవారం ఆయన మీడియాకు వివరించారు. ‘ఆధునాతన సాంకేతిక వసతులతో దక్షిణాదిలోనే తొలిసారిగా నిర్మితమైన మల్టీప్లెక్స్ థియేటర్లు ఇవి.

ఇందులో ఐదు స్ర్కీన్స్ ఉన్నాయి. స్ర్కీన్ వన్‌లో ఏర్పాటు చేసిన 64 అడుగల వెడల్పు తెర ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. హైదరాబాద్‌లో ఉన్న మల్టీప్లెక్స్ అన్నింటిలో ఇదే పెద్ద తెర. అలాగే స్ర్కీన్ 2లో ఎల్‌ఈడీ స్ర్కీన్ ఏర్పాటు చేశాం. దానికి ప్రొజెక్షన్ ఉండదు. దృశ్యం చాలా స్పష్టంగా, మంచి సౌండ్ సిస్టమ్‌తో ఉంటుంది. అన్ని స్ర్కీన్స్‌లోనూ ఏసీ , సౌండ్ టెక్నాలజీల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాం. మొత్తం 3 లక్షల చదరపు అడుగుల్లో ఈ కాంప్లెక్స్ నిర్మించాం.
గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్‌లో షాపింగ్ మాల్స్ ఉన్నాయి.. మూడో ఫ్లోర్‌లో ఫుడ్ కోర్టు, నాలుగో ఫ్లోర్‌లో థియేటర్లు ఉన్నాయి. విద్యార్థులకు ఉదయం షోలకు టికెట్ ధరలో రాయితీలు ఉన్నాయి. ఆరేళ్ల క్రితమే ఈ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించినా కొవిడ్ వల్ల జాప్యం జరిగింది’ అని చెప్పారు.