Boney kapoor : అతిలోక సుందరి శ్రీదేవి మనల్ని వీడి ఐదు సంవత్సరాలు అయ్యింది. కానీ ఇప్పటికీ మనమధ్యనే ఉన్నట్లు అనిపిస్తోంది. ఆమె నటనతో అందంతో ఆభిమానుల్లో గుండెల్లో ఇప్పటికీ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే ఉంటుంది. శ్రీదేవి లేని లోటును తెలుగు ప్రేక్షకులతో పాటు ఆమె కుటుంబ సభ‌్యులకు ఎవరూ తీర్చిలేరు. శ్రీదేవికి సంబంధించిన విషయాలను వారి కుటుంబానికి సంబంధించిన ముచ్చట్లను అప్పుడప్పుడు శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ షేర్ చేస్తుంటారు. బోనీ కపూర్ తాజాగా శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ ఆల్బమ్ నుంచి ఆమెతో దిగిన చివరి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ఈ త్రోబ్యాక్ పిక్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బోనీకపూర్ నిన్ను మిస్ అవ్వడం లేదని ఎందుకంటే నువ్వు మాతోనే ఉన్నావని క్యాప్షన్ ను జోడించారు. ఫిబ్రవరి 2018లో దుబాయ్‌లో కుటుంబ వివాహానికి హాజరైన శ్రీదేవి, అక్కడే ఆమె మరణించింది. చనిపోయే ముందు శ్రీదేవీ బోనీ కపూర్, వారి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, బోనీ కపూర్ సోదరి రీనా కపూర్ తో కలిసి ఓ అందమైన ఫోటో దిగింది. అందమైన చీరలను కట్టుకుని అంతే అందంగా ముస్తాబై ఓ వివాహ వేడుకకు హాజరైనప్పుడు ఈ చిత్రాన్ని క్లిక్ చేసినట్టు తెలుస్తోంది. బోనీ కపూర్, క్యాప్షన్‌లో, చివరి చిత్రం అని రాశారు. ప్రస్తుతం బోనీకపూర్ పోస్ట్ చేసిన ఈ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. శ్రీదేవిని మరోసారి అందరూ మిస్ అవుతున్నారు.

ఈమధ్యనే బోనీ కపూర్ తన దివంగత భార్య శ్రీదేవి జ్ఞాపకార్థం నటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “మీరు 5 సంవత్సరాల క్రితం మమ్మల్ని విడిచిపెట్టారు …… మీ ప్రేమ , జ్ఞాపకాలు మమ్మల్ని వీడలేదు మీరు ఇప్పటికీ మాతోనే ఉన్నారు అని రాశారు.

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ కూడా తన తల్లిని గుర్తు చేసుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. నటి ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీదేవితో ఉన్న పిక్ ను పంచుకుంది. నేను చేసే ప్రతి పనిలో నేను నిన్ను చూస్తున్నాను, నేను ఇప్పటికీ మీ కోసం ప్రతిచోటా వెతుకుతున్నాను అమ్మ, నీకు కూతురైనందుకు నేను ఎంతో గర్వి్స్తున్నాను, నేను ఎక్కడికి వెళ్లినా, నేను చేసే ప్రతి పని మీతోనే మొదలవుతుంది మీతోనే ముగుస్తుంది అని భావోద్వేగమైన పోస్ట్ చేసింది. ఈ పిక్ చూసిన జాన్వీ స్నేహితులు , ఇండస్ట్రీ ప్రముఖులు కామెంట్స్ బాక్స్ లో శ్రీదేవికి నివాళులర్పించారు.
