తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ ని గద్దె దించడంలో చంద్రబాబు నాయుడుతో పాటు, అతని మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర కూడా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ పగ్గాలు తీసుకొని ముఖ్యమంత్రి కావడంతో అతని మీద ఎక్కువగా విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత దగ్గుబాటి టీడీపీలో ఇమడలేకపోయారు.
దీంతో బయటకి వచ్చి చాలా కాలం రాజకీయాలకి దూరంగా ఉన్నారు. తరువాత తన భార్య ఎన్టీఆర్ కూతురు పురందరేశ్వరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చారు. ఆమె కేంద్ర మంత్రిగా కూడా ఆ పార్టీలో పని చేసింది. అయితే రాష్ట్ర విభజన అనంతరం పురందరేశ్వరి కాంగ్రెస్ ని వీడి బీజేపీ గూటికి చేరారు. బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయింది.
అయితే 2019 ఎన్నికలకి ముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కొడుకుతో కలిసి వైసీపీలో చేరారు. పర్చూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే గెలవలేకపోయారు. ఎన్నికల తర్వాత నుంచి క్రియాశీలక రాజకీయాలకి దూరంగా ఉన్నారు.ఇక తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాను, తన కుమారుడు రాజకీయాలకి గుడ్ బై చెప్పినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న రాజకీయాలు తమకి అసలు సెట్ కావని భావించి దూరంగా ఉండటం బెటర్ అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే పురందరేశ్వరి మాత్రం రాజకీయాలలో కొనసాగనున్నట్లు చెప్పకనే చెప్పారు. వైసీపీకి దూరంగా ఉన్న దగ్గుబాటి ఫ్యామిలీ టీడీపీకి మళ్ళీ వెళ్ళడానికి పెద్దగా ఆసక్తిగా లేదు. అలా అని బీజేపీ, జనసేనతో కూడా కలిసి ట్రావెల్ చేయడానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపధ్యంలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తుంది.