సత్తెనపల్లిలో గత కొంతకాలంలో మంత్రి అంబటి రాంబాబుకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్కడ క్యాడర్ కూడా బలంగా ఉంది. అలాగే బలమైన నాయకులని పవన్ కళ్యాణ్ సిద్ధం చేశారు. ఈ నేపధ్యంలోనే ఆ మధ్య ఆడియోటేపుల కలకలం వెనుక కూడా జనసేన హస్తం ఉందనే అంబటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో తరుచుగా పవన్ కళ్యాణ్ మీద అంబటి రాంబాబు సోషల్ మీడియా ద్వారా అలాగే ప్రెస్ మీట్ లు పెట్టి ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ పదే పదే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. తాజాగా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయితే అందరికంటే ముందు స్పందించింది కూడా అంబటి రాంబాబు కావడం విశేషం.
భేటీ ముగియగానే అంబటి రాంబాబు మీడియా ముందుకి వచ్చి పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టేసారు అంటూ విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే నెల రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి నియోజకవర్గంలోనే కౌలు రైతు భరోసా యాత్ర చేసి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకి డబ్బులు పంపిణీ చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ అంబటిపై తీవ్ర ఆరోపణలు చేసారు. బాధితులకి వచ్చే డబ్బులో కూడా వాటాలు అడుగుతున్నారని విమర్శించారు.
దీనిపై అంబటి సవాల్ విసిరారు. మరుసటి రోజే ఓ మహిళ మీడియా ముందుకి వచ్చి టానకి వచ్చి సిఎం రివీల్ చెక్కులో సగం డబ్బులు ఇవ్వాలని అంబటి డిమాండ్ చేసారని ఆరోపణలు చేసింది. అయితే వీటి వెనుక జనసేన ఉందని అంబటి గ్రహించారు. స్థానికంగా జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అంబటిపైన కేసు పెట్టారు. సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో బలవంతపు వసూళ్ళకి అంబటి రాంబాబు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో గాదె జిల్లా కోర్టుని ఆశ్రయించి ఆధారాలతో సహా చూపించారు. దీంతో అంబటి రాంబాబుపై తక్షణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపై పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదంటే కాలయాపన చేస్తారా అనేది చూడాలి.