ఏపీ రాజకీయాలలో చాలా రోజుల తర్వాత ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ ఆయనతో భేటీ కావడం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. గత కొంతకాలంగా రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిపై ఇప్పటికే చర్చలు కూడా నడుస్తున్నాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఇక జనసేన పార్టీకి 40 సీట్ల వరకు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారనే మాట వినిపించింది.
అయితే అధికారికంగా ఈ పొత్తుల విషయాన్ని ఎవరూ ధృవీకరించలేదు. జనసేన, బీజేపీ పొత్తులో ఉందని, కలిసి ఎన్నికలకి వెళ్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. ఇక టీడీపీ వ్యూహాత్మక మౌనం వహిస్తూనే అవసరమైన సందర్భంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా మాట్లాడుతున్నారు. అయితే జనసేనకి నాయకత్వ బాధ్యత అప్పగిస్తేనే టీడీపీతో పొత్తు ఉంటుందని జనసేన నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. కచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని జనసైనికులు భావిస్తున్నారు. అయితే చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొని పని చేస్తున్నాడు అని వైసీపీ నాయకులు పదే పదే విమర్శలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రచారం, సభలు కూడా చంద్రబాబు సూచనల ప్రకారమే నడుస్తాయని విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శలని జనసైనికులు బలంగా తిప్పికొడుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను, అన్ని పార్టీలకి కలుపుకొని వైసీపీని గద్దె దించుతా అని గట్టిగానే సభలలో చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం జీవో నెంబర్ వన్ తీసుకొచ్చి ప్రతిపక్షాల రోడ్ షోలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లకి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని, అదే సమయంలో ఏదో ఒక క్లారిటీ కూడా పొత్తుల విషయంలో ఇచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది.