కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటనకి ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కొత్తగా జీవో నెంబర్ 1 తీసుకొచ్చి రోడ్ షోలు, ర్యాలీలి నిషేధం అని ప్రభుత్వం ప్రకటించింది. ఇక చంద్రబాబు పర్యటనకి రెండు రోజుల ముందుగానే ఈ ప్రకటన చేయడంపై టీడీపీని కంట్రోల్ చేయడానికి వైసీపీ చేసిన కుట్రగా ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా రోడ్ షోలపై నిషేధం విధించడాన్ని తప్పు పట్టాయి. దీనిపై హైకోర్టుకి వెళ్ళడానికి ప్రతిపక్షాలు సిద్ధం అవుతున్నాయి. ఇలా రోడ్ షో ఆంక్షల నేపధ్యంలో తాజాగా నేడు చంద్రబాబు కుప్పం పర్యటన జరిగింది. ఈ పర్యటనని పోలీసులు అడ్డుకుకున్నారు. కార్లతో ర్యాలీ నిర్వహించేందుకు సైతం పోలీసులు అభ్యంతరం తెలియజేశారు.
రోడ్ షోలపై నిషేధం ఉన్న నేపధ్యంలో కార్ల ర్యాలీ ఆపాలని చంద్రబాబుకి సూచించారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే కుప్పం పర్యటనకి వైసీపీ జీవో నెంబర్ 1తో ఆంక్షలు పెట్టడంతో చంద్రబాబు తన వ్యూహాన్ని మార్చుకున్నారు. ప్రభుత్వం చెప్పినట్లే ప్రతి గ్రామంలో సభ నిర్వహించి తన పర్యటనని ముగిస్తానని తెలిపారు. దీనికి సంబంధించి తన పార్టీ నాయకులకి కూడా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.
పర్యటనలో భాగంగా ఇప్పటికే పెద్దూరులో పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి గ్రామస్తులని కలిసారు.రేపటి నుంచి గ్రామాలలో వరుస సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. సభలకి కచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చంద్రబాబు ఆ దిశగా తన పర్యటనని మార్చుకున్నారు. గ్రామసభల ద్వారా మరింత ఎక్కువ మందితో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.