అధికార పార్టీ వైసీపీ నియంతృత్వ విధానాలపై రోజురోజుకి సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతుంది అనే సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే పంచాయితీ నిధులు విడుదల చేయకపోవడం, అలాగే గ్రామ పంచాయితీలలో అధికారాలు సర్పంచ్ లకి లేకపోవడం, అభివృద్ధి పనులు లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది అధికార పార్టీ సర్పంచ్ లలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. క్రింది స్థాయి నాయకత్వంలో ప్రభుత్వంపై ఉన్న అసహనాన్ని కొంత మంది నాయకులు నేరుగా చూపించేస్తున్నారు. అలాగే నియోజకవర్గాలలో పార్టీలో నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు యదా మామూలే. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలలో కూడా జగన్ నియంతృత్వ పోకడల మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బహిరంగంగానే సభలు, సమావేశాలలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. నెల్లూరులో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి గత కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఈ మూడేళ్ళ కాలంలో అస్సలు అభివృద్ధి అనేదే లేదని అన్నారు. అలాగే తన నియోజకవర్గంలో ఇంకొకరి పెత్తనాన్ని కూడా ప్రశ్నించారు. అలాగే సంక్షేమం పేరుతో డబ్బులు ఇస్తే ఎవరూ ఓట్లు వేయరాని వ్యాఖ్యానించారు. అయితే ఆనం వ్యాఖ్యలని వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకొని అతన్ని వెంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవి నుంచి తప్పించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా వేరొక విధంగా వైసీపీ అధిష్టానంపై అసహనం వ్యక్తం చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణప్రసాద్ తాజాగా ఓ సమావేశంలో ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావుని ప్రభుత్వం వేధించడంపై అసహనం వ్యక్తం చేశారు. చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో ముగ్గురు చనిపోయిన ఘటనలో ఉయ్యూరు శ్రీనివాసరావుని బాధ్యుడిని చేస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై వసంత రియాక్ట్ అయ్యారు. ఉయ్యూరు శ్రీనివాసరావు తనకి చాలా కాలంగా స్నేహితుడు అని తెలిపారు. ఎప్పటి నుంచో అతను సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశ్యంతోనే అతను సోషల్ సర్వీస్ చేస్తున్నాడని అన్నారు. అయితే గుంటూరులో జరిగిన ఘటన అనుకోకుండా యాదృశ్చికంగా జరిగిందని, దానిని పట్టుకొని అతన్ని వేధించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ముఖ్యంగా ఎన్నారైలపై ప్రభుత్వం వేధింపులకి పాల్పడటం కరెక్ట్ కాదని అన్నారు. ఉయ్యూరు శ్రీనివాసరావు ఎంతో మంచి వ్యక్తి అని పేర్కొన్నారు.