Srinagar colony : కటిక పేదవాడైనా, బాగా డబ్బులు సంపాదించిన ధనికుడైన దైవం ముందు అందరూ సమానమే అని అంటుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా మారింది శ్రీ నగర్ కాలనీలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సిబ్బంది తీరు. నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులతో ఆలయం అంతా కూడా సందడిగా మారింది. ఈ పర్వదినం రోజు స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు జన్మ తరించిపోతుందని భక్తులు భావించారు కానీ, ఆలయ సిబ్బంది తీరుతో తీవ్ర స్థాయిలో విసుగెత్తిపోయారు.

గోవిందా గోవిందా అని హరినామ స్మరణ చేస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడని కొంగుబంగారం అవుతుందని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు భావిస్తారు. అందులోనూ నిన్న అత్యంత విశిష్టమైన ముక్కోటి ఏకాదశి కావడంతో స్వామివారి దర్శనార్థం శ్రీనగర్ కాలనీలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు చేరుకున్నారు. చందనం డ్రైఫ్రూట్స్ అలంకరణలో దర్శనమిచ్చిన స్వామి వారిని చూసి భక్తులు తరించిపోయారు. తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శనార్థం ఆలయానికి చేరుకున్నారు. ఉచిత దర్శనం కోసం జనాలు బారులు తీరారు అయితే విఐపి లకు ఒక ట్రీట్మెంట్ సామాన్య భక్తులకు మరో ట్రీట్మెంట్ ఆలయం లో ఉన్నదని భక్తులు ఆరోపించారు . వంద రూపాయలు పెట్టి ప్రత్యేకంగా టికెట్ కొన్నా కూడా సాధారణ లైన్లో కలిపేస్తున్నారని విఐపి లకు మాత్రం ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతూ ప్రత్యేక ప్రసాదాలను అందజేస్తున్నారని ఆలయ సిబ్బందిపై మండిపడ్డారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగదని అన్ని ఏర్పాట్లు తీసుకుంటామని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామని తాగునీటి వసతి నుంచి ప్రసాదం పంపిణీ వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని ఆలియ ఈవో లావణ్య తెలిపారు కానీ అక్కడ పరిస్థితి మరోలా ఉంది. క్యూ లైన్ లో కనీస సౌకర్యాలు లేవని భక్తులు మండిపడుతున్నారు. ప్రసాదాల పంపిణీకి సంబంధించి విరాళాలు సేకరిస్తున్నప్పటికీ ప్రతి ఏటా కూడా పులిహారను మాత్రమే పంపిణీ చేస్తున్నారన్నారు. దేవుడు అందరివాడేనా మధ్యలోని వారు మాత్రం సెలబ్రిటీలకే ప్రధాన్యతనే ఇస్తున్నారని సామాన్య ప్రజలను మరిచిపోతున్నారన్నారు. దేవుడి ఆలయంలో పేద ధనిక అన్న వివక్ష ఎందుకు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆలయం సిబ్బంది తన తీరును మార్చుకుని సవ్యంగా ఉండాలని పేర్కొంది.