తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీని తెలుగు రాష్ట్రాలలో విస్తరించే పనిని మొదలు పెట్టాడు. తెలంగాణలో ఎలాగూ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పై కేసీఆర్ దృష్టి సారించాడు. అయితే కేసీఆర్ ఏపీలో రాజకీయాలు చేయడానికి ఎవరిని ఎన్నుకుంటారు అనే ఆసక్తి అందరిలో ఇన్ని రోజులు నెలకొంది. టీడీపీని దెబ్బ కొట్టడానికి ఏమైనా ఆ పార్టీ నుంచి నాయకులని ఆహ్వానించే ప్రయత్నం చేసే అవకాశం ఉందా అని అనుమానించారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలపైన కేసీఆర్ దృష్టి పెడుతున్నాడు అని. వారికి అండగా బీఆర్ఎస్ ఉంటుందని చెబుతూ ఏపీలో రాజకీయాలు చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. విశ్లేషకుల అంచనాకి తగ్గట్లుగానే ఏపీలో కేసీఆర్ రాజకీయ కార్యాచరణ నడుస్తుంది.
అయితే ఏపీలో ప్రవేశిస్తున్న బీఆర్ఎస్ పార్టీ దెబ్బ ముందుగా జనసేన మీద పడినట్లు తెలుస్తుంది. జనసేన పార్టీ తరపున గత ఎన్నికలలో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్ధులు బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది. వారిలో ఇద్దరు ఇప్పటికే జనసేనని వీడి బయటకి వెళ్ళిపోయిన వారు కాగా, ఒకరు పార్టీలో క్రియాశీలకంగా లేకుండా కూడా జనసేనలోనే కొనసాగుతున్న తోట చంద్రశేఖర్. 99టీవీ అధినేతగా ఉన్న తోట చంద్రశేఖర్ రేపు బీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరబోతున్నారని తెలుస్తుంది.
అలాగే ఏపీ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడిగా అతన్ని కేసీఆర్ నియమించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు, అనకాపల్లి ఎంపీగా జనసేన పార్టీ తరపున పోటీ చేసిన పార్ధసారధి బీఆర్ఎస్ పార్టీ తీర్ధం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. వీరు రేపు హైదరాబాద్ లో అధికారికంగా కేసీఆర్ సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారని తెలుస్తుంది. జనసేన పార్టీలో పనిచేసిన వారిని కేసీఆర్ టార్గెట్ చేయడం ద్వారా ఆ పార్టీ మీద విమర్శలు చేయించి మూడో స్థానంలోకి తాము రావాలని చూస్తున్నట్లు బోగట్టా.