గత కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్ ఏ సమావేశంలో పాల్గొన్న కూడా ప్రతిపక్షాలపై ఒకే తరహా విమర్శలు చేయడం అలవాటుగా మారిపోయింది. ప్రభుత్వ సంబందిత కార్యక్రమాలు జరిగినపుడు కేవలం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి మాత్రమే మాట్లాడాలి. ఒక వేళ ప్రతిపక్షాలు పాలసీ విషయంపై విమర్శలు చేస్తే దానికి సమాధానం చెప్పే విధంగా ముఖ్యమంత్రి స్క్రిప్ట్ ఉండాలి. నిజానికి ప్రతిపక్షాలు చేసే విమర్శలు, లేదంటే సలహాలు ఏవైనా కూడా ప్రభుత్వం స్వాగతించి వాటిపై తాము ఎలాంటి కార్యాచరణ చేస్తున్నామో చెప్పాల్సిన బాద్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. అలాగే సంబందిత శాఖల మంత్రుల మీద ఉంటుంది. అయితే ఏపీలో మంత్రులు ఎవరు ఏ శాఖలు నిర్వహిస్తున్నారు అనేది ప్రజలకి కూడా తెలియకుండా అయిపొయింది.
దీనికి కారణం మంత్రుల ప్రెస్ మీట్ పెడితే అది కేవలం ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేసి తిట్టడానికి మాత్రమే అని ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయారు. ప్రెస్ మీట్ జరిగినంత సేపు కేవలం వ్యక్తిగత విమర్శలు, బూతులు, వ్యక్తిత్వ హననం తప్ప ఏమీ ఉండదు. ఒక మంత్రి రోజా అయితే తిరుమల దర్శనం చేసుకొని ఆలయం బయటకి వచ్చి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం అలవాటుగా మార్చేసుకుంది. ఇక జగన్ శంఖుస్థాపనలు, శిలాఫలకాలు, బటన్ నొక్కే కార్యక్రమాలు చేసినపుడు పేపర్ లో స్క్రిప్ట్ చూస్తూ అందులో ఒకే తరహాలో రాసిన విమర్శలని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండటం అలవాటుగా మారింది.
తాజాగా అనకాపల్లి సభలో కూడా ప్రతిపక్షాలని విమర్శిస్తూ దుష్టచతుష్టయం అనే మాటని ఉపయోగించారు. అలాగే పవన్ కళ్యాణ్ పై దత్తపుత్రుడు, మూడు పెళ్ళిళ్ళు, మూడు పెళ్ళాలు అంటూ విమర్శలు ఎప్పటిలాగే చేసారు. ఇక ఎప్పటిలాగే నాయకత్వం అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, 100కి 98 శాతం హామీలు నేరవేర్చాం. ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తుంది అంటూ రొటీన్ విమర్శలు చేయడం విశేషం.
అయితే ఒకే తరహా విమర్శలు పదే పదే చేయడం వలన సభలకి వచ్చే ప్రజలలో కూడా అసహనం పెరిగి అసలు ప్రమాదం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ యుద్ధక్షేత్రం అన్న తర్వాత తంత్రాలు, వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులు ఎప్పుడూ ఉంటాయి. అయితే వాటిని బలంగా తిప్పి కొట్టే స్థాయిలో పదునైన విమర్శలు ఎప్పటికప్పుడు అధికార పార్టీల దగ్గర ఉండాలి. అయితే ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఒకే స్వరం మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నారనే మాట వినిపిస్తుంది.