చంద్రబాబు నెల్లూరు పర్యటనలో కందుకూరులో రోడ్ షో సభ నిర్వహిస్తూ ఉండగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది తెదేపీ కార్యకర్తలు చనిపోయిన ఉదంతం పార్టీ శ్రేణులని తీవ్రంగా కలచివేసింది. ఇక కార్యకర్తలని కోల్పోయిన బాధలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇతర నాయకులు ఉన్నారు. ఇక కార్యకర్తలని పార్టీ తరపున ఏ విధంగా అండగా ఉండాలనే విషయం మీద చర్చించి చనిపోయిన వారి కుటుంబాలకి ఆర్ధిక సహకారం అందించడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో అధికార పార్టీ వైసీపీ దీనిని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. పార్టీల బహిరంగ సభలు జరిగినపుడు ఒక్కోసారి దురదృష్టవశాత్తు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి.
వైసీపీ సభల సమయంలో ఈ స్థాయిలో కాకున్నా తొక్కిసలాటలు పలు సందర్భాలలో జరిగాయి. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ దొరికిందే అవకాశం అన్నట్లు చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు అధికార దాహానికి ఇంకెంత మంది బలైపోవాలని కొందరు అంటూ ఉంటే, పదవీ వ్యామోహంలో ప్రజల ప్రాణాలతో బాబు ఆడుకుంటున్నారు అంటూ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. రాత్రి సమయాలలో ఇరుకు సందుల్లో సభని పెట్టి చంద్రబాబు ప్రజల ప్రాణాలు తీసారని హోంమంత్రి తానేటి వనిత విమర్శలు చేశారు. ఇక పెద్దిరెడ్డి కూడా చంద్రబాబుపై ఈ ఘటనని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు.
అయితే టీడీపీ కూడా దీనిపై అధికార పార్టీ నేతల విమర్శలపై ఎదురుదాడి చేశారు. అన్నిపార్టీలు గతంలో సమావేశాలు నిర్వహించిన ప్రదేశంలోనే నేను కూడా సభ పెట్టానని, అయితే దురదృష్టఘటన జరిగిపోయిందని, దీనిపై తాను ఎక్కువ విమర్శలు చేయాలని అనుకోవడం లేదని, తనపై ఆరోపణలు చేసే వారి విజ్ఞతకి వదిలేస్తున్నా అని అన్నారు. అలాగే జగన్ పాదయాత్ర సమయంలో చాలా మంది వైసీపీ కార్యకర్తలు చనిపోయారని, గతాన్ని గుర్తుంచుకొని విమర్శలు చేయాలని వర్ల రామయ్య అధికార పార్టీపై విమర్శలు చేశారు.