Kaikala Satyanarayana : నటశిఖరం కైకాల సత్యనారాయణ గారి మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. సినీ ప్రముఖుల మోములో తీవ్ర విషాధ ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కైకాల స్వగ్రామమైన కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు కౌతవరం గ్రామంలో విషాధఛాయలు నెలకొన్నాయి. కైకాల మరణ వార్తను తెలుసుకుని ఆయన సన్నిహితులు, బంధువులు, స్నేహితులు, శ్రుయోభిలాషులు హైదరాబాద్ బయలుదేరారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ ప్రముఖలు ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు.

సినీదిగ్గజం కైకాల మృతి పట్ల తెలంగాణ రాష‌్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయారని, మూడు తరాల తెలుగు ప్రేక్షకులు అభిమాన నటుడుగా పేరు సంపాదించుకున్నారన్నారు. ఆయన మరణం తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరని లోటని పేర్కొన్నారు.

నటసార్వభౌమా అని అనిపించుకున్న మేటి నటులు కైకాల అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సినీ రంగంలో తనదైన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మనసును గెలిచిన కైకాల గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికై ప్రజలకు సేవలందించారన్నారు. ఆయన ఐదు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్‌తో కైకాలకు విడదీయలేని బంధం ఉందన్నారు. ఎన్టీఆర్ ది కైకాల ది అన్నాదమ్ముల సంబంధం కన్నా ఎక్కువన పేర్కొన్నారు. ఆయన ఇలా హటాత్తుగా మరణించడం సినీ ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.

పౌరానిక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను అలరించారని జానపద, సాంఘిక, చారిత్రక చిత్రాల్లోనే తనదైన మేటి నటనతో ప్రేక్షకులను అలరించారని, సినీ ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్న కైకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మా కుటుంబంతో కైకాల గారికి చాలా అనుబంధం ఉందని, నాన్నగారితో కలిసి అనేక చిత్రాల్లో నటించారని, తన సినిమాల్లోనూ కీరోల్ పోషించి నవరస నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారని తెలిపారు. అలాంటి నటసార్వభౌముడు నేడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.