కొంత మంది ఏదో ఒక పని చేసి వార్తల్లోకి ఎక్కాలని అనుకుంటారు. మరికొంత మంది అయితే అత్యుత్సాహంతోనో లేదంటే తెలియక చేస్తారో కాని వారు చేసే పనులే వారికి కావాల్సినంత హైప్ తీసుకొని వస్తాయి. ఫేమ్ ఎలా వచ్చిన కూడా దాని ద్వారా వారు కొద్ది రోజులు వార్తల్లో నిలిచిపోతారు. ఇప్పుడు ఓ వ్యక్తి అలాంటి ఓ సంఘటనతో వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. పోర్న్ వీడియోలు చూడటం వలన పోలీస్ పరీక్షలలో ఫెయిల్ అయ్యానని, దీనికి కారణం గూగుల్ కాబట్టి ఆ సంస్థ నుంచి తనకి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాడు. దీనిపై విచారించిన ధర్మాసనం సదరు వ్యక్తికి చివాట్లు పెట్టి, న్యాయస్థానం సమయాన్ని వృధా చేసినందుకు ఏకంగా లక్ష రూపాయిల జరిమానా విధించింది.
విషయంలోకి వెళ్తే మధ్యప్రదేశ్‌కు చెందిన కిషోర్ చౌదరికి పోలీస్ అవ్వాలనే కోరికతో ఆ పరీక్షలకి సిద్ధం అయ్యాడు. అయితే పోలీస్ ఎంట్రన్స్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అయితే తాను పరీక్షలకి ప్రిపేర్ అవ్వడానికి యుట్యూబ్ చూసే సమయంలో అశ్లీల ప్రకటనలు వచ్చి వాటిని చూసేలా ప్రోత్సహించాయని భావించి, అలాంటి ప్రకటనలు ఇస్తున్న గూగుల్, యుట్యూబ్ చానల్స్ పై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. అలాగే వారి నుంచి తనకి 75 లక్షల పరిహారం ఇప్పించాలని కూడా పిటీషన్ లో పేర్కొన్నాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటీషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గౌరవప్రదమైన పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ అశ్లీల వీడియోలు చూడటమే తప్పు.
అలాంటిది ప్రకటనల ద్వారా ప్రోత్సహించారని ఎలా అంటావ్ అంటూ ప్రశ్నించారు. ఇలాంటి పిచ్చి పిటీషన్స్ తో కోర్టు సమయం వృధా చేస్తావా అంటూ ఏకంగా లక్ష రూపాయిల జరిమానా విధించారు. అయితే అశ్లీల ప్రకటనలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న యుట్యూబ్ చానల్స్, గూగుల్ పై నియత్రణ ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ పిటీషన్ వేశానని, తనకి వేరే దురుద్దేశ్యం లేదని ఆ యువకుడు చెప్పాడు. అలాగే అంత జరిమానా తాను కట్టుకోలేనని బ్రతిమలాడాడు. దీంతో జడ్జ్ లు కనికరించి జరిమానా మొత్తం 25 వేలకి తగ్గించారు. ఈ కేసుకి సంబందించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా కూడా కోర్టులో కేసులు వేసే వారు ఉంటారా అంటూ నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు.